సాక్షి, తిరుపతి: నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు" అంటూ వైఎస్సార్‌సీపీ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అదే సమయంలో.. ఎన్డీయే విజయోత్సవ సభను నిర్వహిస్తుండడం.. దానికి కూటమి పెద్దలు హాజరు అవుతుండడం చర్చకు దారి తీసింది.
తిరుపతిలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార ఎన్డీయే కూటమి నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. అదే సమయంలో ఇటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ ఏర్పాట్లు చేసింది.
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాల షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రెస్‌మీట్‌లో కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ కేడర్‌కు, ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. అయితే..
వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు జరగనున్న రోజునే తిరుపతి సమీపంలోని దామినీడులో ఎన్డీయే విజయోత్సవ సభ ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు పక్షాలు ఒకేసారి భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. కీలక కూడళ్లు, సభా ప్రాంగణాలు, ర్యాలీ మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


