కాపులకు బాబు ద్రోహం..! | YSRCP state Kapu leaders fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

కాపులకు బాబు ద్రోహం..!

Jun 22 2026 5:36 AM | Updated on Jun 22 2026 5:36 AM

YSRCP state Kapu leaders fires on Chandrababu Govt

వెంకటాయపాలెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు

కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు విస్మరించింది.. 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సు మండిపాటు

కాపు కార్పొరేషన్‌కు రూ.3,000 కోట్లు ఇస్తామని నమ్మబలికి కనీసం మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు.. 

కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలి 

కాపు కార్పొరేషన్‌కు వెంటనే రూ.9 వేల కోట్లు విడుదల చేయాలి

డిప్యూటీ సీఎం పవన్‌ నోటికి, భాషకు.. హద్దు, ఆనకట్ట లేదా?.. ఎన్నికల్లో కులం చూపించి ఆయన ఓట్లు అడగలేదా?  

కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే చంద్రబాబు అతడి కుటుంబాన్ని ఎందుకు కలిశారు? 

సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాం.. ఈ ప్రభుత్వంలో కాపులకు ఏమాత్రం గౌరవం లేదు.. 

కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై అక్రమ కేసులను ఉపసంహరించాలి 

కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు మూడు ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటు 

వైఎస్‌ జగన్‌ వివిధ పథకాలతో కాపు సామాజిక వర్గానికి రూ.39,317.80 కోట్ల లబ్ధి 

‘కాపు నేస్తం’ పథకం కింద కాపు మహిళలకు రూ.2 వేల కోట్ల సాయం.. ఇళ్ల స్థలాలిచ్చి సొంతింటి కల సాకారం 

అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెనతో కాపు విద్యార్థులకు లబ్ధి 

కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు.. డీబీటీ, నాన్‌ డీబీటీతో కాపులకు రూ.వేల కోట్ల మేర ప్రయోజనం 

కాపు భవనాల కోసం రూ.వంద కోట్లు నిధులు.. గత ప్రభుత్వంలోనే నాలుగు భవనాలు ప్రారంభం

సాక్షి, అమలాపురం/రామచంద్రపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని.. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని.. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలని.. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు బకాయి పెట్టిన రూ.9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్లు ఇస్తామని హామీలిచ్చిన చంద్రబాబు రెండేళ్లలో మూడు రూపాయిలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ‘కాపు నేస్తం’ సహా ఎన్నో పథకాలను ఇచ్చారని.. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా కాపు మహిళలు, విద్యార్థులకు మేలు జరిగిందని.. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకొస్తారా? అని మండిపడ్డారు. కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని వెంకటాయపాలెంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కాపులపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలు, సంక్షేమ పథకాల నిలిపివేతతో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

‘కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కడం లేదు.. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా? అధికార పార్టీ నేతలు ఎంతోమంది అరాచకాలు చేస్తుంటే పవన్‌కు కనపడటం లేదా? సాయికృష్ణ కేసులో పోలీసులను సస్పెండ్‌ చేయడంతో సరిపెడతారా? అయినా కేసులు ఉంటే మనుషులను చంపేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు..’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్‌ నోటికి, భాషకు.. హద్దు, ఆనకట్ట లేకుండా మాట్లాడు­తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఇదే పవన్‌ కళ్యాణ్‌ కులం చూపించి ఓట్లు అడగలేదా? ఇప్పుడు అదే కులంలో ఓ మనిషిని చంపేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని నిలదీశారు. 

ఈ ప్రభుత్వం, పోలీసుల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు సర్కారు అరాచకాలను కలసికట్టుగా ఎదుర్కొంటామని.. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తామున్నామనే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. ఇది మరే కులాలకూ వ్యతిరేకం కాదని, కాపులతో పాటు మిగిలిన కులాలను కూడా కూడగట్టి వెళ్తామని, కాపులతో ఉంటే తమకు ఓ భరోసా ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అమలు చేసిన నవరత్న పథకాలతో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా కాపు మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విదేశీ విద్య పథకం ద్వారా కాపు విద్యార్థులకు మేలు జరిగిందని.. కాపు నేస్తం కింద ఏటా రూ.15 వేలు ఇచ్చి కాపు మహిళల అభ్యున్నతికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేయూత అందించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు రూ.వేల కోట్ల నిధులిచ్చి కాపులకు ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, రౌతు సూర్యప్రకాశరావు, జి.శ్రీనివాస్‌ నాయుడు, దూలం నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, చిన్న, మల్లి వెంకట్రాజు, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, జె.గురునాథరావు, చిన్న శీను, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియచేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. పక్కన కాపు ముఖ్య నాయకులు 

ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం
‘రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. నష్టపోయిన వారింటికి వెళ్తాం. అక్కడే కూర్చుంటాం. వారికి ధైర్యాన్ని, మ­నోస్థైర్యాన్ని కల్పిస్తాం. ఆర్థికంగా చేయూతనిస్తాం. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆపద కల్పించినా కలసికట్టుగా ఎదుర్కొంటాం..’ అని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కాపు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఎనిమిది మంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించారు.  ‘నా కుమారుడి శవాన్ని ఇవ్వకున్నా.. కనీసం బూడిదైనా ఇవ్వాలి..’ అంటూ కాపు యువకుడు సాయికృష్ణ కన్నతల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న హృదయ విదారక ఘటనలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

ఎన్నికల్లో కులం చూపించి ఓట్లేయమనలేదా?: బొత్స
రానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్నంలో కూడా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యన్నారాయణ తెలిపారు. అవసరమైతే ప్రతి జిల్లాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపి శవం కూడా కనిపించకుండా ఏవిధంగా మాయం చేశారో చూశామన్నారు. దీనిపై సిట్‌ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సిట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. ‘క్రిమినల్‌ కేసులుంటే చంపేస్తారా? అలాగని చట్టంలో, రాజ్యాంగంలో ఉందా? అలా అయితే కమిషన్‌ ఎందుకు వేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులకున్న అంగబలం, ఆర్థిక బలంతో అవసరమైతే సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 

వైఎస్సార్‌సీపీ నాయకులను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రౌడీలతో పోల్చడంపై బొత్స తీవ్రంగా మండిపడ్డారు. అధికారం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో ఇదే పవన్‌ కళ్యాణ్‌ కులం చూపించి ఓట్లు వేయమంటారా? ఇప్పుడు అదే కులంలో మనిషిని చంపేస్తే ఆయనకు అడగాల్సిన బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. ‘కాపులకు న్యాయం జరుగుతుందని రెండేళ్లు ఎదురు చూశాం. అయినా అన్యాయమే జరిగింది’ అని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కాపు నేస్తం సహా ఎన్నో పథకాలను ఇచ్చారని, ఇప్పుడు గతంలో ఉన్న పథకాలను సైతం తీసేస్తామంటే ఒప్పుకోబోమన్నారు.

ఇవీ తీర్మానాలు..
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. బాబు సర్కారు అరాచ­కా­లను ఖండిస్తున్నాం. సాయికృష్ణను పోలీ­సులే చంపేశారు. క్రాంతికుమార్‌ ఆత్మహత్య­కు కూడా పోలీసులే కారణం. వీరి మరణాలపై సీబీఐతో విచారణ చేయాలి.
⇒ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.
⇒ కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు మూడు ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం.
⇒ కాపు కార్పొరేషన్‌ నిధులు వెంటనే విడుదల చేయాలి.
⇒ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.
⇒ వైఎస్సార్‌సీపీ హయాంలో కాపు నేస్తం పథ­కం కింద మహిళలకు రూ.2 వేల కోట్ల సా­యం అందించారు. ఈ ప్రభుత్వం మహిళ­ల­కు రూ.9 వేల కోట్ల బాకీలు చెల్లించాలి.

రూ.3,000 కోట్లన్నారు.. రూ.3 కూడా ఇవ్వలేదు
కాపుల సంక్షేమానికి వైఎస్సార్‌ సీపీ కంటే అధికంగా కట్టుబడి ఉంటామని, రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాయ­మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రూ.3 కూడా కేటాయించలేదని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాపునేతల ఆత్మీయ సమావే­శా­నికి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజర­య్యారు. అనంతరం ఆయన మీడియాతో మా­ట్లా­డారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు 100 మంది గన్‌మెన్‌లను ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఫ్లైట్లు సమకూర్చితే కాపులకు న్యాయం జరిగినట్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల్లో అత్యధికులు చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారన్నారు. వారి జీవితాలు చదువు ద్వారా మాత్రమే మారతాయని, కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొట్టి వారందరికీ అన్యాయం చేస్తోందన్నారు. 

చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, ఆయనకు అనుకూలంగా నోటికి హద్దు లేకుండా మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుకోవడం అనవసరమనే స్థాయి కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు. రౌడీలను ప్రోత్సహిస్తారా..? అంటూ పవన్‌ కళ్యాణ్‌ ఒక రకం నాటకం ఆడితే.. పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ దాగుడు మూతలు, డ్రామాలను కాపులతో పాటు రాష్ట్ర ప్రజలంద రూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తమను రెడ్డి కాపులుగా సంబోధిస్తున్న పవన్‌ కళ్యాణ్‌.. కమ్మ కాపు అవుతాడా? అని ప్రశ్నించారు. కాపులు కాపులేనని, కులం కార్డు వాడుతూ చంద్రబాబుకు ఊడిగం చేయడాన్ని సహించబోరని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న కాపులతో పాటు తమ గొంతు వినిపించలేని ఇతర కులాలకు కూడా అండగా ఉండాలని, అందుకోసం టాస్క్‌ఫోర్స్‌లు, క్రౌడ్‌ ఫండింగ్‌తో ఆదుకోవాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు నాని వివరించారు.

అలాగైతే కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు?: తోట త్రిమూర్తులు
కాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసేందుకు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. ఇది మరే కులానికీ వ్యతిరేకం కాదని, అందరూ కలసి ఉండాలని, అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కుల జాడ్యం పోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లాంటి పదవులన్నీ కులాల వారీగానే కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కులాలు అవసరం లేదన్నప్పుడు.. కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.

‘కాపు నేస్తం’.. వైఎస్‌ జగన్‌
నవరత్నాల పథకాలతో కాపులకు రూ.39,317.80 కోట్ల సాయం
కాపు కార్పొరేషన్‌కు టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలు సైతం చెల్లించింది జగనే

చంద్రబాబు మాదిరిగా తాను మాయమాట­ల­తో మభ్యపెట్టలేనని ముందునుంచీ చెప్పిన వైఎస్‌ జగన్‌ 2019–2024 మధ్య ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో నిజమైన కాపు నేస్తంగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నవరత్నాలతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరే­ష­న్‌ ఏర్పాటు చేసి కాపుల సంక్షేమానికి బాటలు వేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర లాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపులకు తోడ్పాటు అందించి వారు ఆ­ర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. పార్టీ, ప్రాం­తం లాంటివి చూడకుండా, దళారుల ప్రమే­యం లేకుండా కాపులకు నవరత్నాల (డీబీటీ, నాన్‌ డీబీటీ) పథకాల ద్వారా రూ.39,317.80 కోట్లను అందించి వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరే­షన్‌కు రూ.500 కోట్లు, 307 మంది విద్యార్థు­లకు రూ.20.97 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.8.83 కోట్లు ఇవ్వకుండా బకాయి పెట్టగా.. వైఎస్‌ జగన్‌ వాటిని చెల్లించడమే కాకుండా కాపుల సంక్షేమానికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు  నిధులు విడుదల చేయడమే కాకుండా 4 కాపు భవనాలు ప్రారంభించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement