సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలి. అందుకే బాబు మోసాల మానిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నాం. జూన్ 4 నుంచి మా పార్టీ కార్యాచరణ మొదలవుతుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన పనులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి కాగానే విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఇవాళ ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తుంటే పట్టించుకోరు.. మీరు మంత్రిగానే పనికి రారు.. మిమ్మల్ని పార్టీ అధ్యక్షుని ఎలా చేశారు?. ప్రశ్నిస్తా అన్న నాయకుడు ఏం చేస్తున్నారో తెలియదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు గతంలో ఎందుకు అమలు చేయలేదు?. మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా. ఇప్పుడే ఎందుకు అన్నీ గుర్తు వస్తున్నాయి’ అని ప్రశ్నించారు.


