రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

Jul 13 2026 1:04 AM | Updated on Jul 13 2026 1:04 AM

కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో మృతదేహం

గుంటూరు రూరల్‌: కుళ్లిన స్థితిలో క్వారీ గుంతలో వ్యక్తి మృతదేహం ఆదివారం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లభ్యమైంది. సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం... పొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం క్వారీ గుంతలో ఛిద్రమైన స్థితిలో ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రుద్ర ట్రస్ట్‌ సహకారంతో జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఎక్కడైనా చంపి ఇక్కడకు తెచ్చి పడేశారా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో మృతుడు తాడికొండ మండలం ఫణిదరం గ్రామానికి చెందిన మాడుగుల శంకరరావు (52)గా గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఈ నెల 7వ తేదీన చిలకలూరిపేటలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వచ్చాడని, తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 8వ తేదీన మిస్సింగ్‌ కేసు నమోదు చేశారని తెలిసింది. కుటుంబసభ్యులకు నల్లపాడు పోలీసులు సమాచారం అందించారు. వ్యాపార లావాదేవీల వల్ల హత్య చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాలలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement