సీతంపేట: ప్రముఖ కథా, నాటక రచయిత రావిశాస్త్రి(రాచకొండ విశ్వనాథశాస్త్రి) పేరిట ప్రదానం చేసే ‘శ్రీ రావిశాస్త్రి రచనా పురస్కారం–2026’కు తెనాలికి చెందిన ప్రముఖ కథా, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ ఎంపికయ్యారు. ఈ నెల 30న విశాఖపట్నంలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో, డాక్టర్ జి.రఘురామారావు అధ్యక్షతన నిర్వహించే ప్రత్యేక సభలో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. అరసం విశాఖ జిల్లా శాఖ అధ్యక్షుడు ఉప్పల అప్పలరాజు, ఉపాధ్యక్షులు హనుమంతరావు, డాక్టర్ ఈశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి బసు పోతన, కార్యదర్శులు చంద్రమోహన్, శ్యాంసుందర్ తదితరులు వల్లూరు శివప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. సాహిత్యంలో కథా, నాటక రచయితగా వల్లూరు శివప్రసాద్ విశిష్ట సేవలు అందించారని, ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం సముచిత నిర్ణయమని ఉప్పల అప్పలరాజు పేర్కొన్నారు.
కొల్లూరు: అరటి గెలలు లోడుతో ప్రయాణిస్తున్న వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో పంట పొలాలలోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టిన సంఘటన కొల్లూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. లంక గ్రామాల నుంచి అరటి గెలల లోడుతో వాహనం మిర్యాలగూడ బయలుదేరింది. కూలీలను వారి గ్రామంలో దింపేందుకు మండలంలోని కోటిపల్లి వెళుతుండగా కొల్లూరు సమీపంలోని మలుపు దాటిన అనంతరం అకస్మాత్తుగా స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపు కోల్పోయి పంట పొలాల వైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కూలీలు పంట పొలాల్లోకి దూకివేయడంతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పల్టీ కొట్టిన వాహనంలో నుంచి డ్రైవర్ సైతం క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నాదెండ్ల: జాతీయ రహదారి నూతన బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్ బిగించిన ఇనుప రాడ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన తాళ్లూరి జక్రయ్య దివ్యాంగుడు. ఒక కాలు లేకపోవటంతో మూడు చక్రాల బండిపై తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో జక్రయ్య నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం వద్ద రోడ్డు వెంబడి రెయిలింగ్‌కు బిగించిన ఇనుప రాడ్లు దొంగిలించి పాత ఇనుప దుకాణంలో విక్రయిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు గత పదిరోజులుగా సీసీ కెమేరాల ఫుటేజీ గమనించి సుమారు రూ.60 వేలు విలువైన ఇనుప రాడ్లు దొంగిలించి, విక్రయించినట్లు నేషనల్ హైవే పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన వస్తువులను ఎక్కడెక్కడ విక్రయించాడో ఆరా తీస్తున్నారు.


