గుంటూరు మెడికల్: ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐఏపీ) ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో మానసికవ్యాధి వైద్య నిపుణుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ ఉమాజ్యోతిని మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర శాఖకు ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర శాఖలో వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. డాక్టర్ ఉమాజ్యోతి 1999 నుంచి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంఘంలో పలు హోదాల్లో సేవలందించారు. ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ ఉమాజ్యోతికి మానసికవ్యాధి వైద్య నిపుణుల సంఘం గుంటూరు ప్రెసిడెంట్ డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, సెక్రటరీ డాక్టర్ పసుపుల సాయి కిరణ్, ఇతర సంఘ నేతలు, గుంటూరు జీజీహెచ్ మానసికవ్యాధుల వైద్య విభాగానికి చెందిన వైద్యులు, జీజీహెచ్, గంటూరు వైద్య కళాశాల అధికారులు, వైద్యులు అభినందనలు తెలిపారు.
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ మధుమేహౖ వెద్యనిపుణులు, ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వీవీ రామకుమార్ ఆదివారం జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జ్యోతి దేవ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫోరం– 2026 సంవత్సరానికి ‘పేషెంట్ ఎంపవర్మెంట్ డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్స్‘ విభాగంలో ప్రముఖ మధుమేహ నిపుణులు పద్మశ్రీ డాక్టర్ శశాంక్ జోషి, త్రివేండ్రం గోకులం హాస్పిటల్ చైర్మన్ మనోజ్ చేతుల మీదుగా డాక్టర్ రామ్‌కుమార్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా షుగర్ వ్యాధిపై వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పురస్కారాన్ని అందుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన ఆత్మీయ పేషెంట్లకు, సహచర వైద్య బృందానికి, విద్య నేర్పిన గురువులకు, కుటుంబ సభ్యులకు డాక్టర్ రామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


