ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్‌

Jul 13 2026 1:04 AM | Updated on Jul 13 2026 1:04 AM

ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్‌ అదుపులో నకిలీ పోలీసులు? లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ పని సర్దుబాటు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారం పాత బస్టాండ్‌ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో నిర్వహించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రక్రియలో ఎస్జీటీలుగా పనిచేస్తూ స్కూల్‌ అసిస్టెంట్‌ అర్హతలు ఉన్న వారిని వివిధ ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. పలువురు ఎస్జీటీలు గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వెళ్లారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 147 మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల్లో తెలుగు మీడియం విభాగం నుంచి హైస్కూల్‌కు అర్హతలు గల ముగ్గురు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను కోరుకోగా, మరో 10 మంది ఎస్జీటీలు వేర్వేరు పాఠశాలలను కోరుకున్నారు. ఉర్దూ మీడియంలో హాజరైన తొమ్మిది మంది ఉపాధ్యాయుల్లో ఇద్దరు వేర్వేరు పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 147 మంది ఉపాధ్యాయుల్లో 15 మంది పాఠశాలలను ఎంపిక చేసుకోగా, మిగిలిన వారు సుముఖత చూపలేదు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో గుంటూరు డీవైఈవో జి.ఏసురత్నం, ఎంఈవోలు కె.విజయభాస్కర్‌, ఎండీ ఖాసిం, జిల్లా విద్యాశాఖ ఐటీ సెల్‌ సిబ్బంది నాగమల్లేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, నరేష్‌, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తెనాలి రూరల్‌: పోలీసులమని చెప్పి దోపిడీలకు పాల్పడుతున్న వారిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల మల్లికార్జునరెడ్డి ఈ నెల 7వ తేదీన తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో రూ.1.60 లక్షలు విత్‌డ్రా చేశారు. నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తెనాలి వస్తుండగా ఆటోనగర్‌ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులమని, తనిఖీ చేయాలంటూ వాహన పత్రాలను అడిగారు. అదే సమయంలో డిక్కీలో ఉన్న నగదులో నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. ఈ కేసు నమోదు చేసిన రూరల్‌ పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుల్లో ఒకరు చీరాలకు చెందిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి బాపట్లకు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ సమాచారం.

నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఆయా సబ్‌ డివిజన్లలోని డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక బృందాలుగా ఈ తనిఖీలు కొనసాగించారు. తొలుత రిజిస్టర్‌ పుస్తకాలను పరిశీలించారు. రోజుకి ఎంత మంది వస్తున్నారు, ఏయే పనులపై వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారనే విషయాలపై నిర్వాహకుల నుంచి ఆరా తీశారు. అనంతరం గదుల్లో బస చేసిన వ్యక్తుల ఆధార్‌ కార్డులు, ఇతరత్రా గుర్తింపు కార్డులను పరిశీలించారు. జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు నగరంలో వారు ఎందుకు వచ్చారనేది అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా వస్తే ఒరిజినల్‌ ఆధార్‌, ప్రభుత్వ గుర్తింపు కార్డులను పరిశీలించాక వాటి జిరాక్స్‌ కాపీలను తీసుకోవాలని నిర్వాహకులకు పోలీస్‌ అధికారులు సూచించారు. విధిగా రిజిస్టర్లల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలు వాడుకంలో ఉండాలని, కనీసం నెల రోజుల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

దుర్గమ్మకు విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. తిరుపతి జిల్లా పనగలూరుకు చెందిన జి. సుబ్రహ్మణ్యంరెడ్డి కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికా రులకు అందజేశారు. మచిలీపట్నం నరసింహనగర్‌కు చెందిన సీహెచ్‌ శ్రీలలిత కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ డీఈవో కిషోర్‌బాబు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను దాతలకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement