ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: సంకల్ప బలం, క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్యార్థుల తొలి మెట్టు అని ఎమ్మెల్సీ, స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. గుంటూరు రూరల్ అంకిరెడ్డిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్, ప్లస్‌టూలలో నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ సభ్యులకు ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ సంకల్పబలం, క్రమశిక్షణతో అత్యుత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించగలరని చెప్పేందుకు అంకిరెడ్డిపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలే చక్కని నిదర్శనమని అన్నారు. మరోవైపు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో సంయుక్తంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితోనే నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయని, తద్వారా అంకిరెడ్డిపాలెం పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించటమే కాక జూనియర్ కళాశాల విద్యార్థిని ఈ ఏడాది ఐఐటీలో సీటు సాధించగలగడం గొప్ప విషయమన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి, పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సాహక బహుమతులతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రరావు, జాతీయ అవార్డు గ్రహీత ఉప్పాల రామ్మోహనరావు, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు లేళ్ల పెద అప్పిరెడ్డి, కుర్రి సాంబిరెడ్డి, సంజీవరెడ్డి, గంగాధరరెడ్డి, పుల్లారెడ్డి, దేవగిరి సీతారామిరెడ్డి, శ్యామల రఘురామి రెడ్డి , పరంధామ రెడ్డి పాల్గొన్నారు.


