
కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రాష్టవ్యాప్తంగా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిలదీశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘21 మంది కూటమి ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయటం లేదు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులనూ తీసుకురాలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు వెళ్తున్నా కూటమి ఎంపీలు మాట్లాడటం లేదు. కేవలం వైఎస్సార్‌సీపీ ఎంపీలపై ఆరోపణలు చేయటానికే వారు పరిమితం అయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. లేని లిక్కర్ స్కాం గురించి మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ స్కాం గురించి ఐటీ, ఈడీ సమన్లు కూడా ఇచ్చింది. వీటిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని గురుమూర్తి ప్రశ్నించారు.
‘‘యోగేష్ గుప్త, మనోజ్ పాత్ర ఉన్నట్టు కేంద్ర సంస్థలు గుర్తించాయి. టిడ్కోలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. వీటిపై శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకు ప్రశ్నించటం లేదు?. కేంద్రం చంద్రబాబుని పట్టించుకోవడం లేదు. ఏదో కేసుల్లో ఇరికించటానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్సైజ్ శాఖతో సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్‌కసిరెడ్డి, మిథున్‌రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు’’ అని గురుమూర్తి దుయ్యబట్టారు.
‘‘వైఎస్ జగన్ వచ్చాక 43 వేల బెల్టు షాపులు తొలగించారు. మద్యం అమ్మే సమయాన్ని కుదిరించారు. అలాంటప్పుడు లంచాలు ఎవరైనా ఎలా ఇస్తారు?. అయినప్పటికీ కొంతమంది పత్రికాధిపతులను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్క డిస్టలరీలకూ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం బ్రాండులకు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మార్కెట్‌లో ఉన్న బ్రాండులన్నిటికీ చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. కానీ టీడీపీ నేతలు మాపై విష ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు’’ అని గురుమూర్తి చెప్పారు.
