సాక్షి, కృష్ణా/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగింది. గురువారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, తప్పుడు పనులు, రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
కృష్ణాడెల్టాకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ అవనిగడ్డలో పులిగడ్డ ఆక్విడెక్ట్ వేదికగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పేర్నినాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బోండా ఉమా అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారు. దీక్షా శిబిరంలో కోడిగుడ్లు విసరడం, షామియానాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మండిపడ్డారు.
“బోండా ఉమా లాంటి వంద మంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేష్ శునకానందం పొందొచ్చు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదు. మీ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు” అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆయన.. “మీ చేతనైంది చేసుకోండి.. ఎంతమందిని కొడతారో చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. దాడులతో తమకు జరిగే నష్టం ఏమీ లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో బోండా ఉమాను ఉద్దేశించి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ కార్యకర్తలే మీ ఇళ్లకు వచ్చి ప్రశ్నించకుండా చూసుకోండి” అంటూ హెచ్చరించారు. అధికార దర్పంతో చేసే చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌గా మార్చారు: లేళ్ల అప్పిరెడ్డి
ఇటు విజయవాడ ఘటనపై తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌గా మార్చారని, అక్రమాలు, అన్యాయాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయడం దారుణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే బోండా ఉమా దాడులకు దిగారని ఆరోపించారు. దీక్షా శిబిరంలో మహిళలు, విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.
ఆందోళనకారులపై మూత్రం పోశారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. దాడి చేసిన వారిని వదిలి.. మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని, అందుకే తమ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో బెదిరింపులు, దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికితే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.


