మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్‌సీపీ | Ysrcp Leaders Fire On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్‌సీపీ

Jun 24 2026 9:37 PM | Updated on Jun 24 2026 9:41 PM

Ysrcp Leaders Fire On Chandrababu Govt

సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు  వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.

ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్‌ జగన్‌ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.

ముద్రగడపై ట్రోల్స్ సరికాదు:  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.

చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు.  పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజ

ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్‌పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.

ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబు
వైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్‌ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.

సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.

కాకినాడ రూరల్‌తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.

ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.

డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజా
రాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్‌పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.

కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహం
చంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.

ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్‌ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.

పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజా
రాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్‌కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్‌ జగన్‌ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.

ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్‌ జగన్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.

మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.

చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీత
ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. 

ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్‌ జగన్‌ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement