కాట్రేనికోన: మండలంలోని దక్షిణ కాశీగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం కుండలేశ్వరం. ఈ క్షేత్ర విశిష్టతను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలపడంతో భక్తులు తాకిడి అధికమై, ఆదాయం కూడా పెరిగింది. దాంతో ఆలయం చుట్టూ అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. కార్తికమాసంలో వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తుతుండడంతో రెండేళ్లుగా కూటమి నాయకులు అన్నసమారాధన చేపట్టారు. మొదటి ఏడాది భక్తులు ఇచ్చిన విరాళాలకు మొక్కుబడిగా లెక్కలు చెప్పిన కూటమి నాయకులు.. గతేడాది భక్తుల నుంచి వసూలు చేసిన విరాళాలు, ఖర్చులు, మిగులు ఇంత వరకు తేల్చలేదు. అన్నసమారాధన పేరుతో కూటమి నాయకులు చేస్తున్న భారీ దోపిడీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందిచకపోవడంపై ఎంపీటీసీ అక్కల శ్రీధర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దోపిడీ జరిగిన తీరిలా..
కార్తికమాసంలో నెల రోజుల పాటు రోజుకు ఒకరు చొప్పున దాతలు అన్నదానం చేయగా దాత పేరును బోర్డుపై రాసి మైక్‌లో ప్రచారం చేసేవారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అన్నదానానికి ఇచ్చే విరాళాలు కూటమి నాయకులకు చెందిన బ్యాంకు ఖాతాల స్కానర్లు, ఫోన్‌పే నంబర్లు ఆలయం బయట, లోపల పెట్టి ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా సేకరించారు. కూటమి నాయకులు విరాళాలను అనధికారికంగా కౌంటరు పెట్టి పుస్తకంలో దాతల పేర్లు, విరాళాన్ని రాసి సేకరించేవారు. భక్తులకు ఏ విధమైన రశీదులు ఇవ్వలేదు. కనీసం దాతల నుంచి సేకరించిన సొమ్ముకు గ్రామ ప్రజలకు లెక్క చెప్పలేదు. ఆలయ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు, కూటమి నాయకుల కుమ్మక్కు!
కుండలేశ్వర స్వామి ఆలయ భూముల సర్వే నంబర్లు 91, 20, 23–1, 23–5లలో సుమారు 18 ఎకరాల భూముల్లోని మట్టిని కూటమి నాయకులతో దేవాలయం అధికారులు కుమ్మకై ్క అనధికారికంగా అమ్మేశారని ఎంపీటీసీ శ్రీధర్‌తో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టిని అమ్మిన సొమ్మును దేవస్థానం ఖాతాలో జమచేయలేదు. కుండలేశ్వరం పుష్కరఘాట్ వద్ద శ్మశానవాటికలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న భవనం శిలాఫలకం లేకపోవడంతో కొంతమంది సొంత ఖర్చులతో కడుతున్నట్లు, భక్తుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నడవపల్లి ఆలయంలో మామిడిచెట్టు, జమ్మి చెట్టును అనధికారికంగా అమ్మేశారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఆలయ భూమి 23 ఎకరాల శిస్తు రెండు పంటలకు రూ.13 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.97 లక్షలు, మట్టి అమ్మేసిన సొమ్ము ఉన్నా 16 నెలల నుంచి సిబ్బందికి జీతాలు చెల్లించకుండా సంబంధం లేని ఖర్చులతో దేవస్థానం అధికారులు కాజేశారని ఇటీవల పలు సమస్యలపై ఎంపీటీసీ అక్కల శ్రీధర్ మండల పరిషత్ సమావేశంలో నిలదీశారు.
రెండేళ్లుగా వేలానికి చెల్లుచీటీ
కుండలేశ్వరం పంచాయతీలో రెండేళ్లుగా పంచాయతీ కొబ్బరిచెట్లకు వేలం నిర్వహించకపోవడంతో కూటమి నాయకులు దింపు తీయించుకుంటున్నారు. సర్వే నంబర్ 85–1లో పంచాయతీ చెరువును కొందరు అనధికారికంగా పూడ్చి వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులను పూడ్చివేయరాదనే నిబంధనలు ఉన్నా రక్షించవలసిన అధికారులు ధృతరాష్ట్ర పాత్ర పోషించడంతో చెరువును రక్షించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కార్తికమాసంలో ఆలయంలో వలంటీర్లకు వేతనాల పేరుతోనూ కూటమి నాయకుల దోపిడీ జరిగింది. దీనిపై ఈఓ కొర్లపాటి సూర్యవెంకటదుర్గను వివరణ కోరగా కార్తికమాసంలో అన్నసమారాధన ప్రైవేటు వ్యక్తులు నిర్వహించారని, ఇంతవరకు లెక్కలు చెప్పలేదన్నారు. మట్టి అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని, ఆరోపణలు వాస్తవం కాదన్నారు. చెట్లు ఆలయానికి అడ్డుగా ఉన్నందునే అర్చకుల అభ్యర్థనపై కొట్టించామన్నారు. సిబ్బందికి జీతం ఇవ్వాల్సి ఉందన్నారు.
కుండలేశ్వరుని ఆలయంలో అవకతవకలు?
కార్తికంలో అన్నసమారాధన పేరుతో దోపిడీ
భక్తుల విరాళాలపై లెక్కలు చెప్పని వైనం
ఉన్నత న్యాయస్థానం తలుపుతట్టిన
ఎంపీటీసీ సభ్యుడు


