మలికిపురం: గంజాయి వంటి మాదకద్రవ్యాల జోలికి ఏ ఒక్కరూ వెళ్లవద్దని, అలాంటి చర్యలకు పాల్పడితే జీవితాలు నాశనమవుతాయని రాజోలు సీఐ సురేష్‌బాబు హెచ్చరించారు. మలికిపురం పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని మంగళవారం చింతలపల్లి పాత ఓఎన్జీసీ సైట్ వద్ద 1,100 గ్రాముల గంజాయితో తిరుగుతున్న కందికట్ల ప్రదీప్‌ను అరెస్ట్ చేసి అతడి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ప్రధానంగా యువతతో పాటు విద్యార్థులంతా క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. మలికిపురం ఎస్సై మోహన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
ఆలమూరు: మండలంలోని పెదపళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు ఆది శేషుబాబు (36) మృతి చెందాడు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆది శేషుబాబు సోమవారం వేకువజామున వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్‌పై వెళుతున్నాడు. అంతలో కుక్క అడ్డుగా రావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న మెట్లపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో తొలుత ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్కార్ బుక్ ఆఫ్
రికార్డ్స్‌లో రామంకు చోటు
కొత్తపేట: వినూత్న ప్రయోగాలు చేస్తూ రికార్డులు సాధించే పురోహితుడు డాక్టర్ పెద్దింటి రామచంద్రశ్రీహరి (రామం) తాజాగా ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నమోదయ్యారు. కొత్తపేటకు చెందిన రామం గతంలో 8 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండాలను చిత్రీకరించారు. దీన్ని లండన్‌కు చెందిన ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు ఆ సంస్థ కోఆర్డినేటర్ కేవీ రమణారావు (హైదరాబాద్) ద్వారా రామం దరఖాస్తు చేశారు. దీనిని సంస్థ గుర్తించింది. ఆ సంస్థ చైర్మన్ శ్రీధర్ ఆస్కార్‌లో నమోదు చేసి సర్టిఫికెట్‌ను మంగళవారం ఆన్‌లైన్ ద్వారా పంపించారని రామం తెలిపారు.


