సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు.


