సాక్షి, విజయవాడ : అమరావతిలో ఎయిర్ పోర్టు కోసం 19 వేల ఎకరాలు తీసుకోబోతున్నారని.. భూ సేకరణకు అంతే లేకుండా పోతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భూ దాహానికి పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియడం లేదన్నారు.
‘‘99 పైసలకే వెయ్యి కోట్ల భూములు టీసీఎస్‌కు కట్టబెట్టారు. కాగ్నిజెంట్‌కు వెయ్యి కోట్ల విలువైన 22 ఎకరాలను కట్టబెట్టారు. కాగ్నిజెంట్‌కు అమెరికా ప్రభుత్వం మొట్టికాయలు వేసింది. తప్పు చేస్తున్నారని కాగ్నిజెంట్‌పై అమెరికా కేసులు పెట్టబోతోంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి చట్టం అనుమతించదు చంద్రబాబు. అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో ఉల్లంఘటనలకు ప్రయత్నించారు. 1921 ఎకరాల్లో సింగపూర్ సంస్థ స్టార్టప్ సెంటర్ పెడతామన్నారు. ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా పోయారు’’ అని శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.
ఎన్జీటీ తీర్పుకు వ్యతిరేకంగా నదిలోకి కరకట్ట జరపాలని చూస్తున్నారు. కరకట్టకు కొన్ని వందల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కొండవీటి వాగులో నీరు ఎత్తిపోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఇప్పుడు మరో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అమరావతిలో కొన్ని వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది’’ అని శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


