నవీన ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి | - | Sakshi
Sakshi News home page

నవీన ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

యువతను మానవతా స్పృహ కలిగిన శాస్త్రవేత్తలుగా రూపొందించాలి

కృత్రిమ మేధస్సులో స్వదేశీ భావజాలం జోడించాలి

నాయుడమ్మ అవార్డు ప్రదానోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

తెనాలి: ప్రజల శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ స్ఫూర్తిగా నేటి యువతరాన్ని మానవతా స్పృహ కలిగిన శాస్త్రవేత్తలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య భావజాలంతో కూడిన కృత్రిమ మేధస్సులో స్వదేశీ సంస్కారాన్ని జోడించాలని, ఇందుకు తరగతి గదిలో నైతికతతో కూడిన శాస్త్ర పాఠాలను బోధించాలని సూచించారు.డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన పత్యేక సభకు ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపాటి రఘునాధబాబు అధ్యక్షత వహించారు. తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును అమరరాజా గ్రూప్‌ అధినేత గల్లా రామచంద్రనాయుడుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రదానం చేశారు.

● సభలో వెంకయ్యనాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ యలవర్తి నాయుడమ్మ పల్లెటూరి నుంచి దేశ శాస్త్ర సాంకేతికరంగాన్ని దిశానిర్దేశం చేసేస్థాయికి ఎదిగిన మహామనిషిగా గుర్తుచేశారు. విజ్ఞానశాస్త్రం ప్రయోగశాలకే పరిమితం కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి అందాలని భారతరత్న అంబేడ్కర్‌, దీనదయాళ్‌లు చెప్పిన మాటలను నాయుడమ్మ ఆచరించి చూపారని తెలిపారు. 1951లో ఆయన సీఎల్‌ఆర్‌ఐ డైరెక్టర్‌గా చేరేనాటికి దేశంలో తోలు పరిశ్రమలో 56 వేలమందికి జీవనాధార వృత్తిగా మాత్రమే ఉండేదన్నారు. సీఎల్‌ఆర్‌ఐ, సీఎస్‌ఆర్‌ఐల్లో నాయుడమ్మ చేసిన పర్యావరణ అనుకూల సాంకేతికతతో దేశంలో ఆ పరిశ్రమ రూపురేఖలు మారాయని చెప్పారు.

● అవార్డుగ్రహీత గల్లా రామచంద్రనాయుడు తన ప్రసంగంలో నాయుడమ్మతో తనకు గల అనుబంధాన్ని స్మరించుకున్నారు. అమెరికాలో ఉన్నపుడు తిరిగి మాతృదేశానికి వచ్చి, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు తనను ప్రోత్సహించినవారిలో నాయుడమ్మ ఒకరని చెప్పారు. స్వదేశానికి వచ్చినా ఏదైనా సమస్య వచ్చినపుడు తగిన పరిష్కారాన్ని చూపేవారని గుర్తుచేసుకున్నారు. ఆ అనుబంధం కారణంగానే తాను ఈ అవార్డుకు ప్రతిపాదన తీసుకురాగానే వెంటనే అంగీకరించానని వివరించారు. ఫౌండేషన్‌ ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు శాస్త్రసాంకేతికపై ఆసక్తిని పెంచి యువశాస్త్రవేత్తలు ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫౌండేషన్‌ తరపున సైన్స్‌ సెంటర్‌ నిర్వహించిన సైన్స్‌ ప్రయోగాల్లో విజేతలైన విద్యార్థులకు అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్లు, నగదు, జ్ఞాపికను అందజేశారు. రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్‌, అయినాల మల్లేశ్వరరావు, ఫౌండేషన్‌ కార్యదర్శి యలవర్తి పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement