ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఇచ్చిన హామీతో ఒప్పంద ఆధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలను విరమించుకుంటున్నట్లు వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సుమారు 20 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిలే నిరాహార దీక్షలు గురువారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతన పెంపుపై ఉత్తర్వులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఇటీవల కమిటీ సమర్పించిన వేతన పెంపు నివేదికను రాబోయే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసి, ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని వీసీ ఆచార్య కె.గంగాధరరావు హామీ ఇచ్చారన్నారు. ఈ రిలే నిరాహారదీక్షలను రెక్టార్ ఆచార్య ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, నూట అధ్యక్షుడు ఆచార్య పి.బ్రహ్మాజీరావు ఒప్పంద అధ్యాపకుల నిరసన టెంట్ వద్దకు చేరుకుని వారితో మాట్లాడి నిమ్మరసం అందించి శాంతియుత ఆందోళనను విరమింపజేశారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు వెస్ట్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను పొందేందుకు కోర్టు ఫీజు లేదని, పరస్పర అంగీకారంతో పరిష్కారం అవుతుందని, త్వరగా న్యాయం లభిస్తుందని చెప్పారు. అన్ని కోర్టుల పరిధిలో జరుగుతుందన్నారు. అనంతరం జేసి జాతీయ లోక్ అదాలత్ పోస్టర్‌ను విడుదల చేశారు. డీఆర్‌ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
పంట కాలువలోకి
దూసుకెళ్లిన కారు
అత్తోట(కొల్లిపర): మండల పరిధిలోని అత్తోట గ్రామశివారు డొంక రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి చోటుచోసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తోట గ్రామానికి చెందిన కొంతమంది కారులో తెనాలి వెళుతున్నారు. గ్రామ శివారులోని డొంక రోడ్డులో మలుపు గమనించకపోవటంతో కారు ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న కొంత మంది వెంటనే కారులోని వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు.


