గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) గుంటూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ గురువారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి బీఆర్ స్టేడియం, టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించ బడుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సమీర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటం ఆడటం సరికాదన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి కిరణ్ దాసరి, నాయకులు నాయక్, సాయి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


