మహిళ హత్యకేసులో ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్యకేసులో ముగ్గురు అరెస్టు

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

● కూతురు వివాహానికి అడ్డుపడుతుందని హత్య చేయించిన కాబోయే వియ్యపురాలు ● పల్నాడు జిల్లాకు చెందిన బావబామ్మర్దులతో సుపారీ మాట్లాడిన నిందితురాలు ● నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెదకాకాని: మహిళను దారుణంగా హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్‌ డిఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ అన్నారు. ఈనెల 7వ తేదీన పెదకాకాని మండలం, వెనిగండ్లలో దాది కోటేశ్వరమ్మ(48)ను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న చాకుతో గొంతు కోసి హతమార్చిన సంగతి విధితమే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం పెదకాకాని పీఎస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ మృతురాలు కోటేశ్వరమ్మ కుమారుడు సాధిక్‌ గుంటూరు ఆటోనగర్‌లోని మెకానిక్‌ షోరూంలో నాలుగేళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తున్నారు. అదే షోరూంలో దాచేపల్లి మండలం, ముత్యాలంపాడు గ్రామానికి చెందిన యద్దనపూడి మరియకుమారి ఆమె భర్త పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరియకుమారితో సాధిక్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సాధిక్‌ వారి కాపురాన్ని కూడా వెనిగండ్లలోనే పెట్టాడు. కొద్దికాలానికి సాధిక్‌ మరియకుమారి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ.. ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. అంతేకాకుండా మరియకుమారి కుటుంబ అవసరాలకు డబ్బులు ఇవ్వడం, వారి బాకీలు తీర్చడం, కులాలు వేరు కావడంతో ఇష్టం లేని కోటేశ్వరమ్మ మరియకుమారి కుటుంబంతో గొడవ పడుతూ వస్తోంది. తన కుమార్తె వివాహానికి అడ్డుగా ఉన్న ఆమెను ఎలాగైనా హతమార్చాలని మరియకుమారి నిర్ణయించుకుంది. పిడుగురాళ్ల ప్రాంతంలో నివశిస్తున్న తన సోదరితో పరిచయం ఉన్న పల్నాడు జిల్లా, మాచవరం మండలం, రుక్మిణీపురం గ్రామానికి చెందిన అన్నంగి శ్రీకాంత్‌ను సంప్రదించింది. అందుకు అంగీకరించిన శ్రీకాంత్‌ అప్పటికే భార్యపై దాడి చేసి కేసులో నిందితుడిగా ఉన్నాడు. శ్రీకాంత్‌ తనకు తోడుగా తన మేనమామ కొడుకు బత్తుల మహేష్‌కు ఈ విషయం తెలియజేశాడు. మహేష్‌ పల్నాడు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్‌ల చోరీలకు పాల్పడుతూ ఏడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.

పథకం ప్రకారం హత్య...

మరియకుమారి కోటేశ్వరమ్మను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. గత కొద్ది రోజులుగా మృతురాలితో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ వస్తుంది. గతంలో బిర్యానీలో విషప్రయోగం చేసినా సఫలీకృతం కాలేదు. గత 15 రోజుల కిందట కోటేశ్వరమ్మకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి నమ్మించి తాగించింది. దీంతో అనారోగ్యానికి గురైన ఆమె కొద్ది రోజులుగా గేదెలు మేపేందుకు కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఇదే అదునుగా చూసిన నిందితురాలు ఈనెల 7వ తేదీన ఉదయం మృతురాలి ఇంటికి వెళ్ళింది. మంచిగా పలకరించి స్టౌ వెలిగించి దోసె వేసి ఇచ్చింది. అప్పటికే బత్తుల మహేష్‌, అన్నంగి శ్రీకాంత్‌లు నెంబర్‌ ప్లేట్లు తొలగించిన బైక్‌ను సమీపంలోని చెట్టు కింద పెట్టి ఎదురు చూస్తున్నారు. నిందితురాలు ఇచ్చిన ఫోన్‌ సిగ్నల్‌తో ఇరువురూ ఇంటిలోకి ప్రవేశించారు. మీరు ఎవరంటూ మృతురాలు అడగడం, మన పిల్లలే అని చెప్పడం, ఇరువురూ ఒక్కసారిగా కోటేశ్వరమ్మపై దాడి చేసి పక్కనే ఉన్న చాకుతో గొంతు కోయడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇరువురు పక్కనే ఉన్న నీటితో రక్తపు మరకలు కడుక్కుంటుండగా ఒక్కసారిగా పైకి లేచి గోడను పట్టుకోవబోవడంతో మరోసారి చాకుతో బలంగా గొంతు కోసి, బీరువాలో ఉన్న బంగారం, డబ్బులు దోచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్థానికంగా సేకరించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి దొంగిలించిన బంగారు ఆభరణాలు, రూ.70,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ వివరించారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణస్వామి, ఎస్‌ఐలు సురేష్‌, డి.రామకృష్ణ, క్రైం సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement