గుంటూరు ఎడ్యుకేషన్: రైతులు సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలని నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ 2047– వ్యవసాయ ఆధారిత పారిశ్రామికత ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధికారత’ అనే అంశంపై గురువారం జాతీయ సదస్సు నిర్వహించారు. గోవిందరాజులు మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత రైతులుగా అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఇప్పటి వరకు దేశంలో వ్యవసాయం అభివృద్ధి సాధించిన తీరును వివరించారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు రైతుల శ్రేయస్సుకోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి వివరించారు. పొగాకు బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ యువత తమ తెలివితేటలతో పాటు సాంకేతికతపై తమకున్న పట్టుతో వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలన్నారు. సదస్సు కన్వీనర్, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ యు.రవి కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60కి పైగా పరిశోధన పత్రాలు వచ్చాయని, వాటిలో 30 ఉత్తమ పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని చెప్పారు. ఆయా పరిశోధనాంశాలతో అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించిన ప్రత్యేక సంచికను సదస్సులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, పీజీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్.అనితాదేవి, డాక్టర్ కామేశ్వర శాస్త్రి, వీఎస్‌టీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట నర్సయ్య, అధ్యాపకులు డాక్టర్ నిర్మలా రాణి, డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాబార్డు మాజీ చైర్మన్
డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు


