
అసర్ సర్వేని తప్పుడు తక్కెడగా చేశారని.. లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: అసర్ సర్వేని తప్పుడు తక్కెడగా చేశారని.. లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్బుతంగా ఉన్నట్ఠు, జగన్ పాలనలో నాశనం అయినట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్‌ది. అలాంటి జగన్ ప్రాభవాన్ని మసకబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. రూ.3872 కోట్లతో నాడు-నేడు కింద ఫస్ట్ ఫేజ్‌లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారు. ఇప్పటికీ వెబ్ సైట్ లో ఆ వివరాలను చూసుకోవచ్చు’’ అని నాగార్జున యాదవ్ వివరించారు.
వైఎస్. జగన్ హయాంలో విద్యారంగంలో మంచి మార్పులు వచ్చాయని.. కేంద్ర ప్రభుత్వ నివేదికల్లోనే తేలింది. చంద్రబాబు, జగన్ హయాంలను బేరీజు వేస్తూ ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు. జరిగిన అభివృద్ది కళ్లెదుటే కనిపిస్తుంది. జగన్ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జరగలేదని లోకేష్ చెప్పగలరా?.
..స్కూళ్ల అభివృద్ధి జరగలేదని చెప్పించగలరా?. దేశం మొత్తం జగన్ చేసిన అభివృద్ధిని కొనియాడుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నాయి. అలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్‌పై తప్పుడు నివేదికలతో లోకేష్ మాట్లాడకూడదు’’ అంటూ నాగార్జున యాదవ్ హితవు పలికారు.
