సాక్షి, నెల్లూరు: మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చాలా సులభంగా మాట మార్చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఛార్జీలు పెంచను.. ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు బాదుడుకు బాబు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి కాకాణి మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. కూటమి నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచనని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. నాణ్యమైన కరెంట్ అందిస్తామని ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా హామీల వర్షం కురిపించారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. కరెంట్ ఛార్జీల విషయంలో మాట తప్పి ప్రజల నడ్డి విరుస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో బాదుడే బాదుడు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. కానీ, వారు మాత్రం విద్యుత్ చార్జీలు భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చాలా సులభంగా మాట మార్చేశారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై చెప్పుకోవడానికి ఏమీ లేదు.
దేవుడిని అడ్డుపెట్టుకుని లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు హయాంలో వదిలేసి వెళ్లిపోయిన బకాయిలను మేము కట్టాం. వైట్ పేపర్ పేరుతో డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్రంలో అన్ని రంగాలు కుప్పకూలిపోయే విధంగా చంద్రబాబు సర్వనాశనం చేశారు. చంద్రబాబు వల్లే విద్యుత్ రంగం నాశనమైపోయింది. విద్యుత్ ఛార్జీలు పెంచి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
లడ్డూ వ్యవహారంపై కాకాణి కామెంట్స్..
లడ్డూను చంద్రబాబు వివాదం చేసి.. ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. వైఎస్సార్‌సీపీ చెప్పిన సమాధానాలనే సుప్రీంకోర్టు ఏకీభవించినట్టు ఉంది. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. సనాతన ధర్మంలో విడాకులు తీసుకోకూడదని ఉంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇంకా కాకాణి ఏమన్నారంటే..
హామీలన్నీ గాలికి..
ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్ ఛార్జీలు కూడా ఎత్తేస్తామని నాడు బీరాలు పోయిన బాబు.. తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఇప్పుడు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్బంగా.. చంద్రబాబు ఎన్నికల ప్రచార హామీ.. ఇప్పటి ప్రకటన వీడియోలను కాకాణి మీడియా ముందు ప్రదర్శించారు.
చంద్రబాబు తరహాలో మరే నేత ఇంతలా మాట మార్చి ప్రజలను మోసం చేయలేరని కాకాణి అభిప్రాయపడ్డారు. కూరగాయలతో పాటు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే, మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డన సరికాదని ఆయన స్పష్టం చేశారు.
100 రోజుల పాలన కానుక ఇదేనా?
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలపై అదేపనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసిందని గుర్తు చేసిన మాజీ మంత్రి, హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని తేల్చి చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధమైన చంద్రబాబు, ప్రజలకు వంద రోజుల పాలన కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆక్షేపించారు.
ఏకంగా రూ.8100 కోట్ల భారం?
‘ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్మెంట్’ (ఎఫ్‌పీపీసీఏ) ఛార్జీలు ఒక్కో పంపిణీ సంస్థ (డిస్కమ్)లో ఒక్కో విధంగా ఉండడంతో పాటు, ప్రసార పంపిణీ (టీ అండ్ డీ. ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్) నష్టాలు రెండూ కలిపి.. 7.99 శాతం నుంచి 10.99 శాతం వరకు ఉన్నాయని కాకాణి తెలిపారు. దాని ప్రకారం లెక్కిస్తే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి వివిధ డిస్కమ్‌లలో ఒక్కో యూనిట్‌పై రూ.4.14 నుంచి రూ.6.69 వరకు భారం పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా మొత్తం రూ.8,100 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ ఛార్జీలపై విరుచుకుపడిన చంద్రబాబు, ఇప్పుడు అవే ఛార్జీల పేరుతో రూ.8,100 కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు.
డిస్కమ్‌లకూ నాడు బకాయిలు
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటికి డిస్కమ్‌లు రూ.4,315 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2019 నాటికి అవి ఏకంగా రూ.20 వేల కోట్లకు చేరాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. అంతే కాకుండా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.43,744 కోట్లు బకాయి పెట్టారని, వాటిని జగన్‌గారి ప్రభుత్వం చెల్లించిందని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి: రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment