రూ.423.64 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్
రూ.443.76 కోట్లకు కోట్ చేసి పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ
4.75% అధిక ధరకు కట్టబెట్టడంతో ఖజానాపై రూ.20.12 కోట్ల భారం
జీఎస్టీ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లు రీయింబర్స్ చేస్తామన్న ఏడీసీఎల్.. దీంతో కాంట్రాక్టు విలువ రూ.523.18 కోట్లకు చేరుతుందంటున్న అధికార వర్గాలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి కొండవీటి వాగు వరద ముప్పు తప్పించేందుకు, ఉండవల్లి వద్ద ఆ వాగు నుంచి 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేలా ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. ఈ ఎత్తిపోతల పనులకు రూ.423.64 కోట్ల విలువతో నవంబర్ 14న అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కాంట్రాక్టు విలువ కంటే రూ.4.75 శాతం అధిక ధర... రూ.443.76 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు పనులను అప్పగించేందుకు సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాయి.
ఈ మేరకు పనులను మేఘాకు అప్పగిస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనుల కేటాయింపుతో ఖజానాపై రూ.20.12 కోట్ల భారం పడింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లను కాంట్రాక్టర్‌కు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.523.18 కోట్లకు చేరుకుంది.
5 వేల క్యూసెక్కుల ఎత్తిపోతకు రూ.222.44 కోట్లు
కొండవీటి వాగు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేందుకు ఉండవల్లి వద్ద 2017–18లో రూ.222.44 కోట్లతో ప్రభుత్వం ఎత్తిపోతలను పూర్తి చేసింది. వీటిని మేఘా సంస్థనే చేపట్టింది. నాటితో పోల్చితే ఎత్తిపోతల పనుల్లో వినియోగించే స్టీల్, సిమెంటు, పంప్‌లు, మోటార్లు, విద్యుత్ ఉపకరణాలు తదితరాల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ, ప్రస్తుతం 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసే పనులను రూ.523.18 కోట్లకు మేఘా సంస్థకే ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, దీని వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.380 కోట్లకు మించే అవకాశం లేదని, అంచనాల దశలోనే రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల మేర భారీగా అక్రమాలు జరిగాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కట్టబెట్టడం వల్ల కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చారని.. ఆ మేరకు ఖజానాకు నష్టం కలిగిందంటున్నారు.
జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ ఉండి ఉంటే..!
జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానంతో టెండర్ల వ్యవస్థకు 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవం పోసింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన వెంటనే వీటిని రద్దు చేసింది. 2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సు పద్ధతిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు సర్కార్ పునరుద్ధరించింది. ఒకవేళ జ్యుడీషియల్ ప్రివ్యూ ఇప్పుడు అమల్లో ఉన్నట్లైతే... టెండర్ నోటిఫికేషన్‌కు ముందే ఆ ప్రతిపాదనలోని తప్పులను ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు నుంచి సాధారణ ప్రజల వరకు ఎత్తిచూపే అవకాశం ఉండేది. వాటిని పరిగణనలోకి తీసుకుని అంచనా వ్యయాన్ని సరి చేయాలని ఏడీసీఎల్ అధికారులను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆదేశించి ఉండేవారు అని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
⇒ రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే 5 శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు కనీసం రూ.20 కోట్లు ఆదా అయ్యేదని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని లెక్కలోకి తీసుకుంటే ఎత్తిపోతల పనుల్లో రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని, దాన్ని కాంట్రాక్టర్‌తో కలిసి ముఖ్య నేత నీకింత, నాకింత అంటూ పంచుకు తినేందుకు సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు.


