సీఎంకు నదుల బేసిన్ గురించి కనీస అవగాహన లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు
బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా కూడా తెలియదు
తుంగభద్ర నుంచి 600 టీఎంసీలు వరకు వస్తాయనీ తెలియదు
జూరాలపై ‘పాలమూరు’భారం పెడితే రైతులు ఆగమే
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రేవంత్‌కు అంతర్జాతీయ స్థాయి అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. సీఎంకు నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్) గురించి కనీస అవగాహన లేదని, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల నడుమ తేడా కూడా తెలియదన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అవమానించం అంటూనే
కసబ్‌తో పోలుస్తారా?
‘నిరాహార దీక్షతో కాంగ్రెస్ మెడలు వంచి తె లంగాణ సాధించిన మహనీయుడు కేసీఆర్. ఆయనకు సభకు వస్తే అవమానించం అని ముఖ్యమంత్రి చెబుతూనే కసబ్‌తో పోలుస్తున్నాడు. సంస్కారం, మర్యాద తెలియని రేవంత్‌కు అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగాలు మాత్రమే తెలుసు. పో లవరం, నల్లమలసాగర్ విషయంలో మేము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ‘గోదావరి బనకచర్ల’విషయంలో ఉమ్మడి కమిటీ వేసిన విషయాన్ని దాచిపెట్టి ఏపీ జల దోపిడీకి రేవంత్ తలుపులు తెరిచాడు..’అని హరీశ్‌రావు ఆరోపించారు.
కృష్ణా వాటాలపై పచ్చి అబద్ధాలు
‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ ఒప్పుకున్నారని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని చెప్పడం లేదు. 811 టీఎంసీల్లో తెలంగాణకు 69 శాతం వాటా దక్కాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీశారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకే కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసినా రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నాడు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అజ్ఞానం బయట పెట్టుకున్నారు..
‘కృష్ణా నీరు అంతా జూరాలకే వస్తుందంటూ రేవంత్ అజ్ఞానం బయట పెట్టుకున్నాడు. తుంగభద్ర ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు 450 నుంచి 600 టీఎంసీలు ప్రతి ఏటా వస్తాయనే జ్ఞానం లేదు. జూరాలపై ‘పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టు’భారం మోపితే ఆయకట్టు దెబ్బతింటుందని జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ రైతులకు తెలుసు. రెండేళ్లుగా పాలమూరు–రంగారెడ్డి కోసం ఒక్క అనుమతి తేకపోగా, డీపీఆర్ కూడా వెనక్కి వచ్చింది..’అని మాజీమంత్రి విమర్శించారు.


