సాక్షి, గుంటూరు: దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు.
గుంటూరు జిల్లా కోర్టు వద్ద కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు. ఉచిత భోజనం కోసం భక్తులు రూ. 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు. కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను. కానీ ఎల్లో మీడియా బీఆర్ నాయుడు ఏదో గొప్పగా పని చేశాడని వాళ్ళ ఛానల్ లో వేసుకుంటున్నారు.
బీఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా...?
టీవీ5 బీఆర్ నాయుడు ఓ బ్రోకర్. దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు. అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒకసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు.
.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ లతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.


