సాక్షి, వైఎస్సార్ జిల్లా: పాలకుల ధోరణి పక్షపాతంగా మారితే ప్రజాస్వామ్య విలువలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను మరిచి, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది.
ఇటీవల పెండ్లిమర్రిలో నిర్వహించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమానికి అన్ని మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ, 'సాక్షి' మీడియా ప్రతినిధిని అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అనుమతి నిరాకరణ జరిగిందని అధికారులు పేర్కొనడం మరింత చర్చనీయాంశమైంది.
ఇది కేవలం ఒక మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావిస్తున్నట్లు జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మంజూరు చేసిన పాస్ ఉన్నా, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పక్షపాత ధోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారిక కార్యక్రమాల్లో మీడియాను అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండేది. మీడియా ముఖంగా ప్రజలతో మాట్లాడే ధోరణి ఆయనలో కనిపించేది. ఇది పాలకుడిగా ఆయనలో ఉన్న ప్రజాస్వామ్య గుణాన్ని ప్రతిబింబిస్తుంది. అదే చంద్రబాబు పాలనలో మాత్రం మీడియా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవాలతో ప్రశ్నించడం.. అనుకూల పత్రికల్లా బాకా ఊదకపోవడమే సాక్షికి అనుమతి నిరాకరించారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.


