భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్స్
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధమైన సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకే రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సభా భవనం వద్ద రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన అర్జీల నమోదు, రిసెప్షన్, కౌంటర్ల వద్దకు జనం క్యూ కట్టారు. అడంగల్‌లో మార్పులు, చేర్పులు, మ్యూటేషన్స్, పట్టాదారు పేరు మార్పులు, అసైన్‌మెంట్ పట్టా, ఎఫ్ లైన్, జాయింట్ ఎల్‌పీఎం సబ్ డివిజన్, 22ఏ నిషేద జాబితా నుంచి భూముల తొలగింపు, రస్తా, స్మశాన వాటికలు, ఆన్‌లైన్ రికార్డుల సవరణ, వారసత్వ నమోదు, పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఇందులో కొన్ని.....
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ శ్రీధర్ అర్జీలు నమోదు చేసుకుంటున్న ప్రజలు
సాగు భూమికి పట్టా ఇవ్వాలి
గ్రామ పొలం సర్వే నెంబరు 41లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని నేను 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాను. ఉలవ, పెసర, కంది వంటి పంటలు వేస్తుంటాను. మన్యం రవిరెడ్డి అనే వ్యక్తి నా భూమిని ఆక్రమించి ఏడాది క్రితం జామాయిల్ చెట్లు నాటాడు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటికి నాలుగు సార్లు అర్జీలు సమర్పించాను. ఇప్పటికై నా నేను సాగు చేసిన ప్రభుత్వ భూమికి నా పేరిట పట్టా ఇవ్వాలి.
– పి.ఇరగయ్య, నల్లాయిపల్లె, అట్లూరు మండలం
భూమి ఆక్రమిస్తున్నారు
మా అవ్వ నారాయణమ్మకు సర్వే నెంబరు 389/1లో 32 సెంట్ల స్థలముంది. అది సబ్ డివిజన్ కూడా జరిగింది. ఆ స్థలంలో ఉన్న కంపచెట్లను తొలగించేందుకు వెళ్లగా, మాదు కనకారెడ్డి, ఎరికల్‌రెడ్డి, జయలక్షుమ్మ అడ్డుకుంటున్నారు. గతంలో తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిశీలిస్తామన్నారు తప్ప ఇంతవరకు పరిష్కరించలేదు. మా పట్టా భూమి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. – టి.వెంకట సుబ్బారెడ్డి, శాఖరాజుపల్లె, సిద్దవటం మండలం
కలెక్టర్ శ్రీధర్
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్స్
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్స్
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్స్


