శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహణ
కడప సెవెన్‌రోడ్స్: విశ్వహిందూ పరిషత్, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప నగరంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర నిర్వహణ, శాంతి భద్రతలపై కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా శాంతియుత వాతావరణంలోనిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను, కనీస సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. ఆయా శాఖల అధికారులు సంబంధిత ఏర్పాట్లను నిర్ణీత సమయం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మహా శోభాయాత్ర నిర్వహించే అన్ని ప్రాంతాల్లో, సెన్సిటివ్ ఏరియాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నగరవాసులు కులమతాలకు అతీతంగా శాంతియుతంగా, భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులను కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నందారపు చెన్నకష్ణారెడ్డి, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డీఎంహెచ్‌ఓ డా.నాగరాజు, ఏపీఎస్పీడీసీఎల్, డీపీఓ, పంచాయతీ రాజ్ సంబంధిత శాఖల అధికారులు, విహెచ్ పి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


