నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
● 9 మంది నిందితుల్లో ఆరుగురు అరెస్ట్
● రూ.2లక్షల10వేలు ఫేక్ కరెన్సీ,
6 మొబైల్‌ఫోన్లు స్వాధీనం
మదనపల్లె రూరల్ : రూ.లక్ష అసలు కరెన్సీకి రెండు రెట్లు అధికంగా నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను ముదివేడు పోలీసులు అరెస్ట్ చేయగా, మదనపల్లె డీఎస్పీ కే.మహేంద్ర బుధవారం వివరాలు వెల్లడించారు. నకిలీనోట్ల వ్యవహారంలో మొత్తం 9 మంది నిందితులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అరెస్ట్‌చేసి, రూ.2లక్షల10వేలు ఫేక్ కరెన్సీ, 6 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీనోట్ల తయారీకి సంబంధించిన ఏ–1 ప్రధాన నిందితుడుతో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. దొరికిన నిందితుల నుంచి క్లూస్ సేకరించి త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. నకిలీనోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన ఏ–1 ఫేక్ నోట్లను తయారుచేసి, కర్ణాటకలోని బెల్గామ్ జిల్లా హుక్కేరి తాలూకా గులాబషా టాకియా వీధికి చెందిన మహమ్మద్ జుబేర్ మకందర్(27) ద్వారా తను చెప్పిన వ్యక్తులకు 1ః2 నిష్పత్తిలో అంటే, 10 వేలు ఒరిజినల్ నోట్లు ఇస్తే...20 వేలు నకిలీనోట్లు ఇస్తుంటాడు. రెండేళ్లుగా ఈ విధంగా సంపాదించిన డబ్బులను ఏ–1, మహమ్మద్ జుబేర్ ఇద్దరూ పంచుకునేవారు. ఈ క్రమంలో తెలంగాణ హైదరాబాద్ సిటీ హయత్‌నగర్‌కు చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి(50)కి ఏ–1 పరిచయం అయ్యాడు. నకిలీనోట్ల మార్పిడి గురించి చెబితే, అందుకు మాణిక్యరెడ్డి ఒప్పుకోవడమే కాకుండా, తనకు తెలిసిన వారైన తెలంగాణ భూపాలపల్లె జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లెకు చెందిన రేనుకుంట్ల సుమన్(32), హైదరాబాద్ షామీర్‌పేట్ బీజేఆర్ నగర్‌కు చెందిన చింతకుంట్ల సుమన్ అలియాస్ పీటర్ (27)ను కలుపుకుని నకిలీనోట్లు మార్పిడి చేస్తుండేవారు. మూడు నెలల క్రితం ఏ–1, బెల్గామ్‌లో ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకే ప్రాంతంలో తరచూ నకిలీ నోట్లు మార్పిడి చేస్తే పట్టుబడతామనే ఆలోచనతో కొత్తగా వేరే ప్రాంతాల్లో చలామణి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మాణిక్యరెడ్డి, కొద్దిరోజుల క్రితం తనకు పరిచయమైన శ్రీ సత్యసాయిజిల్లా రామగిరి మండలం పేరూరుకు చెందిన కమ్మర వెంకటేష్(42), అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం ప్యారంపల్లె గొల్లపల్లెకు చెందిన దాదిమి రమణప్ప(39)ను ముఠాలో సభ్యులుగా చేర్చుకున్నారు. దాదిమి రమణప్ప అంగళ్లులో కాపురం ఉండటంతో, అక్కడ జనసంచారం తక్కువగా ఉంటుందని, నకిలీ నోట్లు మార్చేందుకు అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఏ–1 నిందితుడు జనవరి 6న రూ.2లక్షల10వేల రూపాయల ఫేక్ కరెన్సీని, మహమ్మద్ జుబేర్ ద్వారా అంగళ్లుకు పంపాడు. జుబేర్ నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాణిక్యరెడ్డి, సుమన్, సైమన్, వెంకటేష్, రమణప్పలు నకిలీ కరెన్సీని తీసుకుని మాట్లాడుకుంటుండగా, పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు ముదివేడు పోలీసులు కదిరి–మదనపల్లె మెయిన్‌రోడ్డు దొమ్మన్నబావి క్రాస్ వద్ద ఆరుగురిని అరెస్ట్‌చేసి, నగదుతో పాటు 6 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణలో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన రూరల్ సీఐ రవినాయక్, ఎస్‌ఐ మధును అభినందించారు.


