కమిషనర్లకు బదిలీల గ్రహణం
రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పురపాలకసంఘంపై పచ్చపెత్తనంతో అధికారులు అవినీతికి ద్వారాలు తెరిచేశారన్న ఆరోపణలు పట్టణవాసుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి పనికి కమిషన్ అనే నినాదంతో వివిధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు తమ విధులు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విధులకు వచ్చిన కమిషనర్ల మద్దతు లేకుంటే జరగదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కమిషనర్ల బదిలీలకు దారితీస్తోందన్న వాదన లేకపోలేదు. పుర పాలికను అవినీతి జలగలు పట్టిపీడిస్తున్నా ఉన్నతాధికారులు చోద్యం చూడటమే తప్ప చేసేదే లేదు..ఇందుకు కారణం పచ్చపెత్తనమే అని బహిరంగగానే వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన కమిషనర్లు పచ్చపెత్తనానికి ఎదురొడ్డితే బదిలీ వేటునపడాల్సిన పరిస్ధితులు దాపురించాయని పట్టణవాసులు ఆందోళ న చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు మారడం విశేషం. తాజాగా కమిషనర్‌గా కడప కార్పొరేషన్‌లో శ్యానిటరీ సూపర్‌వైజరుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. మరీ ఈయన ఎన్నినెలలు ఉంటారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మాట వినకుంటే..బదిలీనే..
పచ్చపెత్తనంలో భాగంగా తమ మాట వినకుంటే..కమిషనర్లు వెంటనే బదిలీ అవుతున్నారు. మరికొంతమంది కాసుల కక్కుర్తితో కూటమినేతల కబంధహస్తాల్లో చిక్కుతున్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించి కూటమి నేతలు పురపాలకసంఘానికి సహకారం ఉండదు కానీ, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పనులతోపాటు పలు కార్యకలాపాలకు కమిషనర్లు అనుకూలంగా కొనసాగించలేకపోతే, అప్పుడే కూటమి నేతల నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సివస్తోంది. కమిషనర్ల బదిలీలకు సంబంధించి ముఖ్యనేత సిఫార్సు లేఖకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
ఎన్నికల నుంచి...వరుసపెట్టి..
సార్వత్రిక ఎన్నికల సమయంలో కమిషనరుగా జనార్ధన్‌రెడ్డి పనిచేశారు. తర్వాత ఆయనను బదిలీ చేశారు. అనంతరం రాంబాబును నియమించారు. ఈయనను అధికారపార్టీ నాయకులు ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి గదిలో బంధించి, గొడవకు దిగారు. ఎస్సీఎస్టీ కేసుకూడా పెట్టారు. చివరికి టీడీపీ నేతల ఆగడాలకు మానసికంగా అనారోగ్యంపాలయ్యారు. వేలూరు ఆసుపత్రిలో చికిత్సపొందేందుకు లాంగ్‌లీవ్ పెట్టి వెళ్లిపోయారు. నెల్లూరు కార్పొరేషన్ నుంచి నాగేశ్వరరావు కమిషనరుగా రాజంపేటకు వచ్చారు. వచ్చీరాగానే వివాదాల్లో ఇరుక్కున్నారు. గతంలో ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం శ్యానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును కమిషనర్‌గా రాజంపేటకు ప్రభుత్వం నియమించింది. ఈయన రాగానే అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈయనను కూడా ఇటీవల ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
శానిటరీఅధికారులే..కమిషనర్లు
మేజర్ పంచాయతీగా ఉన్న రాజంపేట దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నగర పంచాయతీగా మారింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాజంపేట పురపాలకసంఘం గ్రేడ్–2గా మారింది.టీడీపీ ప్రభుత్వం వచ్చాక పురపాలిక అభివృద్ధి అటుంచి, కమిషనర్ల బదిలీ, కమిషన్లు, స్వలాభర్జన దిశగా టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పచ్చపెత్తనంలో కమిషనర్లు విలవిలలాడుతున్నారు. చివరికి చికెన్ వేస్ట్‌ను కై వసం చేసుకునేందుకు కూడా పురపాలిక పచ్చరాజకీయంతో వేడెక్కుతోంది.
కమిషనర్లకు బదిలీల గ్రహణం


