స్టార్టప్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం
వేంపల్లె : స్టడీ కామ్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్, సియాంటే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు స్టార్టప్ కంపెనీలతోనే ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో స్థాపించిన గ్రీన్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికే ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు.స్టడీ కామ్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ 2022లో ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ సిఎస్‌ఈ చెందిన పూర్వ విద్యార్థి జానీబాషా స్థాపించారు. మేక్ ఇట్ టుగెదర్ బిలీవ్ ఇన్ కొలాబరటివ్ లర్నింగ్ అనే దృష్టితో సాంకేతికత ఆధారిత సహకార విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సియాంటే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్కే వ్యాలీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పూర్వపు విద్యార్థి నవీన్ స్థాపించారు. ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలకు కార్యాచరణాత్మక మేదస్సు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ స్టార్టప్ కంపెనీలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు ప్రాజెక్టు అవకాశాలు, ప్లేస్మెంట్ రూపంలో మద్దతునిస్తాయన్నారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు సంబంధిత స్టార్టప్ కంపెనీల నుంచే స్టై ఫండ్ అందతుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి.కొండారెడ్డి, ఇంటర్నె షిప్ సెల్ కోఆర్డినేటర్ కిశోర్, తదితరులు పాల్గొన్నారు.


