విద్యార్థుల ఉజ్వల భవితకే ఇంటర్‌లో మార్పులు
కడప ఎడ్యుకేషన్ : జాతీయ విద్యా విధానానికి (ఎన్‌ఈపీ–2020) అనుగుణంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2025–26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్‌లో, పరీక్ష విధానంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అఽధికారి(ఆర్‌ఐఓ) టీఎన్‌వీ వెంకటేశ్వర్లు తెలిపారు. కడపలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో గురువారం ఆర్‌ఐఓ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి సిలబస్, పరీక్ష విధానంలో తెచ్చిన సమూల మార్పులపై డీఈసీ సభ్యులు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించేలా ఇంటర్‌బోర్డు నూతన సిలబస్ ప్రవేశ పెట్టిందన్నారు. అందుకు అనుగుణంగా మార్చి 2026లో జ రిగే పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు అమ లు కానున్నాయన్నారు. ఐపీఈ 2026 పబ్లిక్ పరీక్షల్లో రెండో సంవత్సర విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు కొనసాగుతాయని, మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం పూర్తిగా కొత్త విధానంలో భాగంగా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పరీక్షల విధానం అమలవుతుందని తెలియ జేశారు. ఇంతకు ముందు గణిత సబ్జెక్టుల్లో 150 మార్కులకు 1ఎ, 1బి లుగా రెండు పేపర్లు వేరువేరు రోజుల్లో ఉండేవని, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం ఒకే పేపర్‌గా 100 మార్కులకు ఒకే రోజు ఉంటుందన్నారు. అలాగే గతంలో బాటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు వేర్వేరు పేపర్లు, వేర్వేరు రోజుల్లో పరీక్ష కాగా ఈ సంవత్సరం నుంచి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష 85 మార్కులకు ఉంటుందన్నారు. ఐపీఈ –2026 పబ్లిక్ పరీక్షలను ముందస్తుగా అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు చెప్పారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
ఆర్‌ఐఓ టీఎన్‌వీ వెంకటేశ్వర్లు


