గుప్తనిధుల కోసం తవ్వకాలు
పోరుమామిళ్ల : మండలంలోని టేకూరుపేట ఎస్సీ కాలనీలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.బెల్లం రామయ్య నెలన్నర కిందట మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితం ఆయన తమ్ముడు బెల్లం ఓబులేసు బద్వేలులో చనిపోగా టేకూరుపేటకు తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రామయ్యకు పిల్లలు లేకపోవడం, ఓబులేసు బద్వేలులో నివసిస్తుండటం, ఇప్పుడు ఆ ఇద్దరూ లేకపోవడంతో ఇళ్లు నిరుపయో గం ఉంది. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు రామ య్య ఇంటి వెనుక గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అక్కడ ఏమీ దొరకలేదని తెలిసింది. అయితే తవ్వకాలపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఐదేళ్ల కిందట అక్కడ ఎవరో చెంబులు పూడ్చారని, తవ్వితే అవి బంగారుగా మారుతాయని చెప్పడం వల్ల ఇప్పుడు త్రవ్వకాలు జరిపారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఎస్‌ఐ కొండారెడ్డితో మాట్లాడగా తవ్వకాలు జరిగినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. దీనిపై శుక్రవారం విచారణ చేస్తామని తెలిపారు.


