టీడీపీ నాయకులా.. మజాకా
● పది రోజులకే ఎస్‌ఐపై బదిలీ వేటు
● నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చర్యలా..
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకుల అధికార దాహంతో మేము చెప్పిందే వినాలి.. మేము చెప్పినట్టే చేయాలి అన్న ధోరణిలో వారి వ్యవహార శైలి మారింది. నాలుగు రోజుల కిందట పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్లగ్రామ సమీపంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తూగుట్ల మధుసూదన్‌రెడ్డి తోటలో జూదమాడుతున్నారని సమాచారం తెలుసుకుని పులివెందుల ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డి, లింగాల ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డిలు ఆ ప్రాంతానికి వెళ్లారు. 10 రోజుల క్రితం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన ప్రణయ్‌కుమార్ రెడ్డి జూదమాడుతున్న వారిని అరెస్ట్ చేసి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ సంఘటనలో జూదమాడుతున్న టీడీపీ నాయకులు ఎస్‌ఐపై అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అంతేగాక నువ్వు ఆఫ్ట్రాల్ ఎస్‌ఐవి, నువ్వు మాపై, మా నాయకులపై కేసు నమోదు చేస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఎస్‌ఐగా ప్రణయ్‌కుమార్‌రెడ్డి పులివెందులలో బాధ్యత చేపట్టి పట్టుమని పది రోజులు కాకముందే టీడీపీ నాయకులు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెంకు బదిలీ చేయించారు. ఏదీఏమైనా పులివెందులలో టీడీపీ నాయకుల మాట వినకుంటే. పోలీసులకే కాదు.. ఏ అధికారికై నా బదిలీ వేటు తప్పదేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.
నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చర్యలా.. :
పులివెందుల ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది.జూదశాల నిర్వహిస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకుడు కావడంతో ఎస్‌ఐపై బదిలీ వేటు పడటం గమనార్హం.
వివాదస్పదమవుతున్న సబ్ డివిజనల్ అధికారి
పోలీసు డిపార్ట్‌మెంట్‌కు విధేయుడుగా ఉండాల్సిన పులివెందుల సబ్ డివిజనల్ అధికారి అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలకు జీ హుజూర్ అంటూ విధులు నిర్వహించడం వివాదస్పదంగా మారింది. పేకాట ఆడుతున్న టీడీపీ నాయకులను తన చాంబర్‌లో కుర్చీలో కూర్చొబెట్టుకుని వారి ముందే సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐని దండించడం ఎంతవరకు సబబు అని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎస్‌ఐ బదిలీ విషయంలో టీడీపీ నాయకులతో కలిసి సబ్ డివిజనల్ అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
నాకు తెలియకుండా దాడులు చేయవద్దు
అధికార పార్టీ చేసే ఆగడాలకు, వారు చేసే అసాంఘిక కార్యకలాపాలకు, జూదాలకు పులివెందుల సబ్ డివిజనల్ అధికారి వెన్నుదన్నుగా ఉన్నాడని చెప్పవచ్చు. మూడు రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డి టీడీపీ నాయకుల జూదశాలపై దాడి చేయడంపట్ల సబ్ డివిజనల్ అధికారి తీవ్రంగా ఆక్షేపించారు. అంతేకాకుండా ఇకపై తనకు తెలియకుండా జూదశాలలపై ఎవరూ దాడులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు ఇలా అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు తెలపడంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.


