పెద్ద పండక్కు ధరాఘాతం
రాజంపేట టౌన్ : పెద్ద పండగ సంక్రాంతి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నింగినంటిన కూరగాయలు,నిత్యావసర ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల పథకాల వల్ల ప్రజలకు ఆర్థిక స్వావలంబన లభించేది. దీంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా సాగించేవారు. పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేవారు.చంద్రబాబు నాయుడు సర్కార్‌లో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన మేరకు పథకాలను అమలు చేయకపోగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోని పథకాలను కూడా తొలగించారు. దీంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తెలుగువారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని కూడా పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గోరుచుట్టపై రోకటిపోటులా నిత్యావసర సరుకులు, కూరగాలు, కోడిగుడ్లు, చికెన్, మటన్ ... ఇలా అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో పేద,మధ్య తరగతి ప్రజలకు పండగ భారంగా మారింది. ఇక ప్రభుత్వం చౌకదుకాణాల్లో కూడా కందిపప్పును ఇవ్వక పోవడంతో పేద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేస్తే కాని పండుగ గడవదు..
సంక్రాంతి పండుగను జరుపుకోవాలంటే ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పండగ సందర్భంగా దాదాపు 90 శాతం మంది హిందువులు పిండివంటలు చేసుకుంటారు. పిండి వంటలకు కావాల్సిన ప్రధానమైన నూనె ధర లీటరు 155 రూపాయిలు ఉంది. అలాగే కందిపప్పు కిలో రూ.120, ఉద్దిపప్పు కిలో.110 ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దినసరి కూలీలు, పనికి వెళితేనే పూటగడిచే పరిస్థితులు ఉన్న నిరుపేద వర్గాల ప్రజల్లో సంక్రాంతి సంతోషం కనిపించడం లేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం దుర్లభంగా మారింది.
మేము నిరుపేదలం. మాబోటివాళ్లు సంక్రాంతి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి లేదు. కూరగాయల నుంచి అన్ని ధరలు పెరిగి ఉన్నాయి. ధరలు ఈ విధంగా పెరిగితే ఏం కొనాలి.. పండుగను ఎలా చేసుకోవాలి.. పండుగ పూటయినా ధరలను తగ్గిస్తే బాగుంటుంది. – లక్షుమ్మ, తుమ్మల అగ్రహారం, రాజంపేట మండలం
సంక్రాంతి పెద్ద పండుగ. రేషన్ స్టోర్లలో ప్రభుత్వం కందిపప్పు కూడా ఇవ్వకుంటే మాలాంటి పేదోళ్లకు పప్పు అన్నం కూడా కరువవుతుంది. కనీసం స్టోర్లలో ఈనెల కందిపప్పు ఇచ్చినా పప్పు అన్నం అయినా తినేవాళ్లం. అన్ని రకాల వస్తువులు, కూరగాయలు, మాంసాహార ధరలు పెరిగాయి. – లలితమ్మ, రాజంపేట
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
నిత్యావసర సరుకులదీ అదే దారి
గుడ్లు, చికెన్, మటన్ కూడా......
ప్రభుత్వ పథకాలు అమలుకాక...
చేతిలో డబ్బులు లేక..
పేద, మధ్య తరగతి
ప్రజల్లో కనిపించని
సంక్రాంతి
సంతోషం
పెద్ద పండక్కు ధరాఘాతం
పెద్ద పండక్కు ధరాఘాతం
పెద్ద పండక్కు ధరాఘాతం


