దుండగుల హల్‌చల్
● ప్రభుత్వ కార్యాలయాలే
లక్ష్యంగా తెగింపు
● తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల్లో చొరబాటు
ఒంటిమిట్ట : వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలో మంగళవారం రాత్రి దుండగులు హల్‌చల్ చేశారు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దుండగులు చొరబడటం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.
తాళాలను పగులగొట్టి..బీరువా ధ్వంసం చేసి
మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మొదట ఎంపీడీవో కార్యాయలంలోకి ప్రవేశించారు. కార్యాలయానికి దక్షణ వైపు ఉన్న ఒక తులుపునకు తాళం వేయలేదని బుధవారం ఉదయం అక్కడికి ముందుగా వచ్చిన స్వీపర్ పెంచలమ్మ చెప్పింది. దీంతో ఆ తలుపును ప్రవేశ మార్గంగా ఎంచుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి లోపలికి వెళ్లిన దుండగులు ఎంపీడీవో, సిబ్బంది గదుల తాళాలను పగులకొట్టారు. ఎంపీడీవో గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేశారు. సిబ్బంది గదిలో ఉన్న కంప్యూటర్లు, బీరువాలు సురక్షితంగా ఉండటం పోలీసులు గమనించారు. ఎందుకంటే దొంగతనానికి వచ్చిన వాళ్లు విలువైన వస్తువులు ఉన్నా ఎత్తుకెళ్లకపోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే లోపలికి వెళ్లిన దుండగులు నగదు లేదా విలువైన వస్తువుల కోసం వెళ్లారా? లేక కీలకమైన దస్త్రాలను మాయం చేసేందుకు వచ్చారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి ఎంపీడీవో కార్యాలయంలో ఎలాంటి వస్తువులు, నగదు, దస్త్రాలు దొంగలించబడలేదని ఎంపీడీవో సుజాత పోలీసులకు స్పష్టం చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో రక్తపు మరకలు
అదే రోజు రాత్రి సమీపంలోని తహసీల్దార్ కార్యాలయంలోనూ దుండగులు చొరబడ్డారు. బాత్రూమ్ వెనుక వైపున ఉన్న వెంటిలేటర్ అద్దాలను తొలగించి లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో లోపలికి వెళ్లిన దుండగుడికి గాయాలైనట్లు తెలుస్తోంది. బాత్రూమ్‌లో ఫ్లోరింగ్, గోడలు, బయట నేలపై రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తుండటంతో దీనిని కీలక ఆధారంగా భావిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం లోపల భాగాన బాత్రూమ్ బయట గడి పెట్టడంతో దుండగులు కార్యాలయం లోపలికి రాలేక, మళ్లీ వచ్చిన దారిలోనే బయటకు వచ్చి పరారైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోకి దుండగలు వచ్చేందుకు ప్రయత్నించడంతో ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయ అధికారి తహసీల్దార్ దామమోదర్ రెడ్డి ఆఫీసులోని దస్త్రాలను పరిశీలించారు. ఏమీ ఎత్తుకెళ్లలేదని స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న సీఐ నరసింహారాజు, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ ఘటన పెద్ద సవాలుగా మారింది. క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి పూట పోలీసుల గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రక్తపు మరకలు, వేలిముద్రల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ నరసింహారాజు, ఎస్‌ఐ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు.
దుండగుల హల్‌చల్


