అభివృద్ధి పనులకు అడ్డంకులు
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి నిధులు విడుదల చేయకపోయినా నగరపాలకవర్గ సభ్యులు 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులతో గతంలో మంజూరైన పనులను పూర్తి చేస్తున్నారు. వాటి ప్రారంభోత్సవానికి తమను పిలవాలి, తమకు చెప్పి పనులు చేయాలంటూ ఆయా డివిజన్లలోని టీడీపీ ఇన్‌చార్జులు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 14వ డివిజన్ ప్రకాష్ నగర్‌లో రూ.10లక్షలతో చేస్తున్న పనులను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. తమను పిలవకుండా ఈ పనులు ఎలా మొదలు పెడతారని వారు కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు సమాచారం. ఆ వర్క్‌కు అనుమతులు రెండేళ్లక్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయని తెలిసింది. ఇన్నాళ్ల తర్వాత కాంట్రాక్టర్ పనులు చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో రోడ్లు, కాలువలు నిర్మించాలంటే వీరి అనుమతి అవసరమా...మధ్యలో వీరి దౌర్జన్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించాల్సిన టీడీపీ నాయకులు, పాత పనులు పూర్తి చేస్తుంటే సైంధవుల్లా మారి అడ్డుతగలడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇలాంటి దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.
అడ్డుపడుతున్న టీడీపీ నాయకులు
నోరెళ్లబెడుతున్న ప్రజానీకం


