నేడు డీఆర్సీ సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: డిస్టిక్ రివ్యూ కమిటీ (డీఆర్సీ) సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: అండర్–14 బాలుర స్పాటింగ్ క్రికెట్ ఎంపికలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. మంగళవారం నగర శివార్లలోని వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో తొలి రోజు సుమారు 32 మందిని ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. రెండవ రోజు బుధవారం ఎంపికలు నిర్వహించి ఇంకా కొంత మందిని ఎంపిక చేస్తామన్నారు. ఈ ఎంపికలను ఏసీఏ సెలక్షన్ స్పాట్టింగ్ మెంబర్స్ హుస్సేన్, శరత్ హాజరై పర్యవేక్షించారు.
వీరపునాయునిపల్లె: మండల పరిషత్,తహసిల్దార్ కార్యాలయ నిర్మాణ పనులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దార్ లక్ష్మిదేవితో కలసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు దూరంగా ఉండటంతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడితే వాటిని నాసిరకంగా నిర్మిస్తే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మిగిలి ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్ రాజేష్ నాయుడు పాల్గొన్నారు.
సిద్దవటం: మండలంలోని భాకరాపేట జెడ్పీ హైస్కూల్‌ను విద్యాశాఖ ఆర్‌జేడీ శామ్యూల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే 6–10వ తరగతుల వరకు జరుగుతున్న ఎఫ్‌ఏ–3 పరీక్ష గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకేశమ్మకు సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఆర్‌బీఐ నిబంధనలను పక్కాగా అమలు చేయాలి
కడప అగ్రికల్చర్: సహకార రంగంలో రిజర్వ్ బ్యాంక్ అంఫ్ ఇండియా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నాబార్డు డీజీఎం రాజ్‌కుమార్‌శర్మ సూచించారు. మంగళవారం కడపలో నాబార్డు ఆధ్వర్యంలో కేవైసీ, ఏఎంఎల్ నిబంధనలు, ఐఆర్‌ఏసీ మార్గదర్శకాలపై కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీసీసీ బ్యాంకు సీనియర్ అధికారులకు అవగాహన సదస్సుతోపాటు వర్కుషాపు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుత బ్యాంకింగ్ మోసాల నివారణ చర్యలపై నిపుణుల చేత విస్తృతస్థాయిలో చర్చించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కడపజిల్లా నాబార్డు సీని యర్ అధికారి విజయ విహారి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ రాజమణి పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళల అక్రమ రవాణా నిరోధకం, రక్షణలో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ సమావేశ మందిరంలో మహిళా పోలీసులకు బాలలకు ఉన్న చట్టాలు, మిషన్ వాత్సల్య అందిస్తున్న సేవల గురించి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ రమాదేవి సచివాలయ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసులు మహిళలు, పిల్లలతో అనునిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశు గృహ అందిస్తున్న సేవలు గురించి వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్,శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.


