అటకెక్కిన అర్బన్ మండలం
అమలు కాని ఆదేశాలు
● 18 ఏళ్లుగా అమలుకు నోచని జీఓ
● ఆదాయం పోతుందని తొక్కిపెట్టిన వైనం
● పనులు జరగక ఇబ్బంది పడుతున్న ప్రజలు
కడప సెవెన్‌రోడ్స్: కడప అర్బన్ మండలం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 18 సంవత్సరాలుగా అమలుకు నోచుకోని విషయం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. నగరాన్ని అర్బన్, రూరల్ మండలాలుగా విభజించి తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే తమ ఆదాయానికి గండిపడుతుందని భావించిన కొందరు అధికారులు ఫైలు కదలకుండా తొక్కి పెట్టించారనే ఆరోపణలున్నాయి. దీంతో అర్బన్ మండలం ఆవిర్భవించకపోవడంతో పనులు జరగక నగర వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పెద్ద ఎత్తున భూమి సమస్యలు తలెత్తాయి. అప్పట్లో నగర జనాభా 2.68 లక్షలు ఉండేది. ఒక్క తహసీల్దారే ఉంటే రోజువారి పాలన, ప్రోటోకాల్ విధులతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించడం కష్టమవుతుందని ఆనాటి ప్రభుత్వం భావించింది. దీంతో కడప మండలాన్ని అర్బన్, రూరల్ కింద విభజించాలని నిర్ణయించింది. కడప నగరంతో పాటు నాగరాజుపల్లె, చెమ్ముమియాపేట, చిన్నచౌకు, పాతకడప, గూడూరు, రామరాజుపల్లె తదితర రెవెన్యూ గ్రామాల్లో ఆరింటిని అర్బన్ కింద, ఐదు గ్రామాలను రూరల్ కింద విభజించాలని ఆనాటి ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. కొత్త తహసీల్దార్ పోస్టు కూడా మంజూరు చేసింది. ఆ మేరకు 2007 సెప్టెంబరు, 1వ తేదీ జీఓ ఎంఎస్ నెం.224 జారీ చేశారు. అలాగే ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఒక మండల సర్వేయర్ పోస్టులను కూడా నాటి ప్రభుత్వం మంజూరు చేసింది.
అర్బన్ మండలం ఏర్పాటులో జాప్యం తగదు
అర్బన్ మండలం కోసం అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా తహసీల్దార్, డీటీ, సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐ, సర్వేయర్ వంటి పోస్టులను కూడా మంజూరు చేసింది. అయితే అధికారులు ప్రజల అవసరాలు గుర్తించి అర్బన్ మండలం ఏర్పాటు చేయకుండా సిబ్బందిని మాత్రం ఇతర విధులకు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అర్బన్ మండలం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. – ఎన్.వెంకట శివ, నగర కార్యదర్శి, సీపీఐ
ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట
కడప నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఇందువల్ల ప్రజల అవసరాలు కూడా బాగా పెరిగాయి. వివిధ పనుల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చిన్నచిన్న పనులు కూడా సకాలంలో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 18 ఏళ్ల క్రితమే నగర ప్రజల అవసరాలను గుర్తించి అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదంటే ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇప్పటికై నా ప్రజల అవసరాలు గుర్తించి అర్బన్ మండలం ఏర్పాటు చేయాలి. – ఎ.రామ్మోహన్‌రెడ్డి, నగర కార్యదర్శి, సీపీఎం
అదే సమయంలో ప్రభుత్వం నంద్యాల, ఆదోని, చిత్తూరు పట్టణాల్లో కూడా అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పట్టణాల్లో అర్బన్ మండలాలు ఏర్పాటయ్యాయి. కానీ, కడపలోనే ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోకుండా 18 సంవత్సరాలుగా మూలనపడ్డాయి. అర్బన్ మండలానికి మంజూరు చేసిన తహసీల్దార్‌ను ప్రస్తుతం కలెక్టరేట్ డి–సెక్షన్ సూపరింటెండెంట్‌గా నియమించి పనులు చేయించుకుంటున్నారు. డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ కడప ఆర్డీఓ కార్యాలయంలో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కలెక్టరేట్‌లో, మండల సర్వేయర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అర్బన్ మండలం ఏర్పాటు చేయకుండా మంజూరు చేసిన ఉద్యోగులను ఇతర కార్యాలయాల్లో నియమించారు. నగర విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా జనాభా ఉంది. ప్రజలు వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే పనిభారం అధికంగా ఉండటం వల్ల ప్రజల పనులు సకాలంలో పూర్తి చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అర్బన్ మండలం ఏర్పాటుకు కలెక్టర్ శ్రీధర్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అటకెక్కిన అర్బన్ మండలం
అటకెక్కిన అర్బన్ మండలం
అటకెక్కిన అర్బన్ మండలం


