సాక్షి,చెన్నై: పెట్టీ భామ అన్నారు.. పల్టీ భామా అంటూ బాడీ షేమింగ్ చేశారు. అయినా సరే, ఉబికి వస్తున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకున్నారే తప్ప.. ఆమె ఎవరినీ తూలనాడలేదు. ‘గత ఎన్నికల్లో గెలుపు కోసం రూ.31 కోట్లు పెట్టా.. వాటిల్లో రూపాయి కూడా ఇవ్వలేదు. మంత్రులు బస చేసేందుకు గదులు బుక్ చేయడానికి మాత్రమే రూ.14 లక్షలు వెచ్చించానంటూ’ ప్రత్యర్థుల ఆరోపణలను వీడియోల ద్వారా ఎదుర్కొన్నారు. కానీ, ఈ విమర్శలు, కుట్రలేవీ ఆమె విజయాన్ని అడ్డుకోలేకపోయాయి!. తమిళనాడు ఉపఎన్నికల్లో ఆమె విజయదుందుభి మోగించారు. అటు పార్టీ అధినేత, సీఎం విజయ్.. ఇటు శ్రేణులు ‘సత్యభామ గెలిచింది’ అంటూ సంబరాల్లో మునిగేలా చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తన రాజకీయ ప్రయాణంలో తొలి అడుగులోనే అంచనాలను తలకిందులు చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో సవాళ్లు ఎదురైనా.. సీఎం విజయ్ తన జనరంజక పాలనతో ప్రశంసలందుకుంటున్నారు. అందుకు రాష్ట్రంలో తాజాగా జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ఒక రెఫరెండమ్‌లా నిలిచాయి. ధారాపురం, మధురాంతకం బైపోల్ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులు పి.సత్యభామ, మరగతం కుమారవేల్ ఘన విజయం సాధించారు.
A party leader is resorting into body shaming is the worst ever. Can’t expect the workers to be better than the party leader! Hitting 52 week low everyday ft. @mkstalin https://t.co/GFpwxFBv19
— Vignesh (@vignesh_txt) October 2, 2026
టీవీకే జోరు.. సత్యభామ ఘనవిజయం
రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన ధారాపురం బైపోల్‌లో టీవీకే అభ్యర్థి పి.సత్యభామ తన సమీప ప్రత్యర్థిపై 9,471 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి గెలుపొందిన సత్యభామ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీ మారినప్పటికీ నియోజకవర్గంలో ఆమెకున్న వ్యక్తిగత పట్టు, విజయ్ క్రేజ్ కలసికట్టుగా పనిచేసి ఈ స్థానంలో పార్టీకి విజయాన్ని సునాయసం చేశాయి.
మరోవైపు మధురాంతకం అసెంబ్లీ స్థానంలో బరిలోకి దిగిన టీవీకే అభ్యర్థి మరగతం కుమారవేల్ భారీ మెజారిటీతో సత్తా చాటారు. ఆమె మొత్తం 19,241 ఓట్ల మెజారిటీతో (మొత్తం 70,916 ఓట్లు) తన సమీప ప్రత్యర్థుల్ని ఓడించారు. ఈ స్థానంలో డీఎంకే అభ్యర్థి ఐ.పరంధామన్ రెండో స్థానంలో (51,675 ఓట్లు), అన్నాడీఎంకే అభ్యర్థి కనిత సంపత్ మూడో స్థానంలో నిలిచారు.
తమిళనాట ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి ఉద్ధండుల మధ్య విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాబోయే రాజకీయ సమీకరణాలకు ఇది బిగ్ ట్రైలర్ లాంటిదని, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతోందనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి : టీవీకే అభ్యర్థిపై స్టాలిన్ దారుణ వ్యాఖ్యలు!?


