
హైదరాబాద్: బీజేపీ-కాంగ్రెస్ రెండు ఒకటేనని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన సాగుతుందన్న కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. అసలు బీజేపీ-బీఆర్‌ఎస్ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌ను ఒక బీసీ నుంచి, రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నుంచి కిషన్‌రెడ్డి లాక్కున్నారన్నారు.
ఇక జూబ్లీహిల్స్‌శాసనసభ ఉప ఎన్నికలో భాగంగా తమ అభ్యర్థి గురించి ఇంకా సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
అదే మా తపన
లోకల్ బాడీ ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్ మంచి సమన్వయంతో ఉందన్నారు మహేస్ గౌడ్. రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలనేది తమ తపన అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జనహిత పాదయాత్ర తనదని,కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఆ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ది కాదన్నారు. తమ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆమోదించాకే ఆ పాదయాత్రను ప్రారంభించామన్నారు.