సాక్షి, తాడేపల్లి: సంతాప సభలో చంద్రబాబు సైతాన్ మాటలు మాట్లాడారని.. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం 700 రోజులే.. ఈలోపు వీలైతే మంచి చేయాలే తప్ప హత్యా రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు.
‘‘వంగవీటి రంగా నుంచి సాల్మన్ హత్య వరకు అనేక మంది చావులకు చంద్రబాబే కారణం. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుని చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి రావటం లేదు. లక్ష్మీపార్వతి తాళిబొట్టును తెంచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ బతికి ఉండగా ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు. వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది ఎవరు?. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తాళి బొట్టు తెంచింది ఎవరు?. పిన్నెల్లిలో సాల్మన్ భార్య తాళిని తెంచింది ఎవరు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.
‘‘చంద్రబాబు అంతటి నీచుడు రాజకీయాల్లో ఉండటం ఏపీ ప్రజల దురదృష్టకరం. ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదివితే చంద్రబాబు నీచ బతుకు తెలుస్తుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఎందుకు రానీయలేదు?. సాల్మన్‌ను హత్య చేసిన వారిని శిక్షించమని కోరాం. ఆ కుటుంబాన్ని ఆదుకోమని కోరాం. కానీ దేనికీ చంద్రబాబు అంగీకరించలేదు. సాల్మన్‌ని చంపిందే కాకుండా కులాల పేరుతో మాట్లాడతారా?
..టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని యరపతినేని గుర్తుంచుకుంటే మంచిది. రాజధానిలో అడుగుకు పది వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని అడిగితే తప్పా?. రాజధాని పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. చంద్రబాబుకు రాజధానిలో ఇల్లే లేదు. గూగుల్ డేటా సెంటర్‌ని రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. కియో మోటర్స్ రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. రాజధాని రైతులను తీవ్రంగా అన్యాయం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అంటేనే జగన్ గుర్తుకు వస్తారు. దానిని కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయటానికి ప్రయత్నించారు.
..సంక్రాంతి పండుగ పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారు. మద్యం సీసా మీద వంద రూపాయలు ఎక్కువ వసూలు చేసి దోపిడీ చేశారు. ఆ సొమ్మంతా చంద్రబాబు, లోకేష్ జేబులో వేసుకున్నారు. చంద్రబాబు అలివికాని అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్కరి మీద పది లక్షల భారం వేశారు. కూటమి నేతల వలనే రాష్ట్రంలోకి యథేచ్ఛగా డ్రగ్స్, గంజాయి దిగుమతి అవుతున్నాయి’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.


