గంజాయి క్రయవిక్రయాలు చేసే 14 మంది అరెస్ట్ రైల్వేస్టేషన్‌లలో తినుబండరాలు విక్రయిస్తున్నట్లు నటిస్తూ అమ్మకాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గంజాయి క్రయ విక్రయాలు చేసే 14 మందిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7.6 కిలోల గంజాయి, మత్తు బిళ్లలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
● గంజాయి క్రయ, విక్రయాలు చేస్తున్నారనే ముందస్తు సమాచారంతో బుధవారం చౌడవరం గ్రామంలో నల్లపాడు పీఎస్, సీసీఎస్ పోలీసులు సోదాలు చేశారన్నారు. ఈ క్రమంలో 14 మందిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
● చౌడవరం గ్రామ వాసి తోట గోపాలకృష్ణ అలియాస్ సాయి, బాపట్ల పర్చూరు మండలం నూతలపాడు గ్రామ వాసి కొల్లూరి నందీశ్వర్ అలియాస్ వరికూటి గౌరీశంకర్, షేక్.ఉస్మాన్ (పాతగుంటూరు), షేక్.సనావుల్లా అలియాస్ ఇర్ఫాన్ (కొత్తపేట), పఠాన్ జానీబాషా (వెంకటరావుపేట, పాతగుంటూరు), పోతార్లంక శ్యామ్ (అల్లీనగర్, పాత గుంటూరు), చల్లా వెంకటేశ్వర్లు (సాయిబాబా కాలనీ), నక్కా సాంబశివరావు (సాయిబాబా కాలనీ), కొడవటి హనోక్ (అల్లీనగర్), షేక్.జబ్బార్ (చంద్రబాబునాయుడు కాలనీ), బజంత్రీ దుర్గాప్రసాద్ అలియాస్ అమ్ము (ఆనందపేట), చల్లా వెంకటేష్ అలియాస్ చాపా, బత్తుల నాగ రాజు, కనిగిరి నాగరాజు అలియాస్ పిల్లి (లాలా పేట)లను అరెస్ట్ చేశారని అన్నారు.
● వీరి నుంచి 7.6 కిలోల గంజాయి, మత్తు బిళ్లలు సీజ్ చేశారని చెప్పారు.
32 ఏళ్ల లోపు వారే..
● ఇందులో సాయి, గౌరీశంకర్ కీలకంగా వ్యవహరించేవారు. సాయిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసు ఉందన్నారు. వీరిద్దరూ ఈనెల 6న ఒడిశా వెళ్లి 8 కిలోల గంజాయిని గుంటూరు తీసుకొచ్చారని చెప్పారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు రైల్వేస్టేషన్ల పరిసరాల్లో తిను బండారాలు విక్రయించేవారని అన్నారు. గంజాయిని సాయి తన ఇంట్లో నిల్వ చేసేవాడని చెప్పారు. తద్వారా చిన్న పొట్లాలుగా చేసి మిగిలినవారు విక్రయించేవారని అన్నారు.
● షేక్ ఉస్మాన్, షేక్ ఇర్ఫాన్, పఠాన్‌బాషా, శ్యామ్‌లు మత్తు బిళ్లలు సైతం విక్రయించినట్లు తెలిపారు. వీరిలో 23 ఏళ్ల ఉస్మాన్ ఓల్డ్‌క్లబ్ రోడ్డులో మెడికల్ దుకాణం నిర్వహించేవాడని గుర్తించారు. ఇతను ఆన్‌లైన్‌లో మత్తు బిళ్లలు బుక్ చేసేవాడని అన్నారు. పట్టుబడిన 14 మంది 32 ఏళ్ల లోపు వారేనని చెప్పారు.


