బృందాలుగా ఏర్పడి సోదాల నిర్వహణ ప్రజా ఫిర్యాదులపై కొనసాగుతున్న విచారణ
నగరంపాలెం: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రధాన కార్యాలయ ఆవరణలోని పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం ఉమ్మడి గుంటూరు ఏసీబీ అధికార, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే నేతృత్వంలో నలుగురు సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు, ముగ్గురు ఎస్‌ఐలు సిబ్బంది ఒక్కసారిగా బృందాలుగా ఏర్పడి ఉదయం 11 గంటల తర్వాత గుంటూరు జీఎంసీకి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని పట్టణ ప్రణాళిక విభాగంలోకి వెళ్లారు. అందులో కార్యాలయపు రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆన్‌లైన్ ఫిర్యాదులను పరిశీలించారు. ఎక్కువగా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగపు సిటీ ప్లానర్ రాంబాబుతో మాట్లాడారు. ఇటీవల ఆన్‌లైన్, నేరుగా వచ్చిన ఫిర్యాదులపై సిటీ ప్లానర్‌ను ఆరాతీశారు.
కీలక రికార్డులు స్వాధీనం
అప్పటికే కార్యాలయంలో కూర్చుని ఉన్న ఇద్దరితో మాట్లాడారు. ఓ పని నిమిత్తం వచ్చానని, గతంలో ఒకరికి కొంత మొత్తంలో ముట్టజెప్పినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే సదరు అధికారి ఎవరనేది ఫిర్యాదు చేప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. అంతేగాక పట్టణ ప్రణాళిక విభాగపు అధికార, సిబ్బందితోనూ ఏసీబీ అధికారులు చర్చించారు. వివిధ ఫైళ్లకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పలువురు అధికారులను విచారించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలపై ఆరా తీస్తున్నారు. కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘనలు, వరుస ఫిర్యాదుల దృష్ట్యా కార్యాలయపు సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి రెగ్యులర్‌గా వచ్చే ఫిర్యాదులపై పరిశీలన చేస్తున్నామని అన్నారు. బుధవారం సైతం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యాహ్నా వేళ ఏసీబీ జేడీ (విజయవాడ) సురేష్‌బాబు గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చారు. ఏఎస్పీ మహేంద్ర మత్తేతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఏఎస్పీకి సిబ్బందికి జేడీ పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలు దాదాపు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ తనిఖీలతో జీఎంసీ ఆవరణలోని మిగతా విభాగపు అధికార, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


