14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

Mar 11 2026 7:28 AM | Updated on Mar 11 2026 7:28 AM

14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

ఉచితంగా వేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడి

గుంటూరు మెడికల్‌: గుంటూరు జిల్లాలో హ్యూమన్‌ పాపిలొమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. గుంటూరు నగరంలోని బృందావన్‌ గార్డెన్స్‌ ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్ల వయస్సున బాలికలకు ఈ వ్యాక్సినేషన్‌ వేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌ ) దేశంలో ప్రధాన శత్రువుగా ఉందన్నారు. దానిని నివారించడానికి ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సిన్‌ పంపిణీకి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 90 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న 83 కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌ ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఒక్క వ్యాక్సిన్‌ ఖరీదు రూ.4 వేలు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 14,167 మంది బాలికలు ఉన్నట్లు అంచనా అని, 21,170 డోసులు అవసరమని తెలిపారు. ఇప్పటివరకు 6,793 డోసులు జిల్లాకు అందాయన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ 14 ఏళ్ల బాలికలు వ్యాక్సిన్‌కు అర్హులన్నారు. మధ్యస్థ లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్న బాలికలకు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకా ఇవ్వాలన్నారు. మునుపటి టీకాకు అలర్జీ వచ్చిన వారు లేదా ఈస్ట్‌ అలర్జీ ఉన్నవారు టీకా తీసుకోరాదని చెప్పారు. టీకా తీసుకునే బాలికలు ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే తల్లిదండ్రులు టీకా కేంద్రానికి పంపాలని సూచించారు. టీకా తీసుకున్న బాలికలు కనీసం 30 నిమిషాలు అక్కడే ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌ బాబు, డీపీఎంఓ సుజాత, తహసీల్దార్‌ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement