పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం 20 రోజులు పూర్తి అయిన రంజాన్ ఉపవాస దీక్షలు
దైవ చింతనతో గడపాలి...
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 20 రోజులు కఠోర ఉపవాస దీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నెలలో ముస్లింలు నమాజ్, దైవ చింతనతో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తారు. తమ సంపద నుంచి కొంత పేదలకు దానం చేస్తారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత వచ్చే షవ్వాల్ నెల మొదటి రోజున రంజాన్ పండుగ నిర్వహిస్తారు. పొగతాగడం, మద్యపానం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఖురాన్ బోధిస్తుంది. సాధారణ సమయాల్లో కంటే ముస్లింలు రంజాన్ మాసంలో భిన్నంగా ఉంటారు. పగలంతా ఉపవాస దీక్ష, నమాజ్, రాత్రిళ్లు ప్రత్యేకంగా తరావీ నమాజ్‌లో పాల్గొంటారు. ఖురాన్ పఠనంతో తరావీ నమాజ్ చేయడం వల్ల పుణ్యఫలాలు దక్కుతాయని వారి విశ్వాసం. ఈ క్రమంలో ప్రత్యేకంగా మౌల్వీలను ఇతర ప్రాంతాల నుంచి పిలిపిస్తుంటారు. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి మత గురువులను ఆహ్వానించి ప్రార్థనలు, నమాజ్‌లు నిర్వహిస్తున్నారు.
భగవంతుడికి భక్తుడికి వారధి...
ఇస్లాం మత పంచసూత్రాలైన ఈమాన్ (దేవుడు ఒక్కడే), నమాజ్ (ప్రార్థన), రోజా (ఉపవాస దీక్ష) జకాత్ (దానం), హజ్ (మక్కా యాత్ర)లను ఆచరణాత్మకంగా నిరూపించుకునే అవకాశం ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు లభిస్తుంది. ఖురాన్ సూచించిన విధంగా రంజాన్ మాసంలో ముస్లింలు పగలు నీరైనా తాగకుండా ఉపవాస దీక్ష ఆచరిస్తారు.
ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం. ప్రతి ముస్లిం దైవ చింతనతో గడపాలి. నమాజ్, రోజా తప్పకుండా ఆచరించాలి. ఉపవాస దీక్ష తప్పనిసరిగా నిర్వహించాలి. మమమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరించడం వల్ల మానసిక, శారీరక ఉల్లాసం ఏర్పడుతుంది. పుణ్యఫలం కూడా లభిస్తుంది.
– షేక్ అబ్దుల్ వాహబ్, ముస్లిం మత పెద్ద


