నా సొమ్ముతోనే రేవంత్‌ బిడ్డ పెళ్లి

Telangana: Labour Minister Malla Reddy Comments On TPCC Chief Revanth Reddy - Sakshi

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడి

నేను డబ్బివ్వలేదని దేవుడిపై రేవంత్‌ ప్రమాణం చేస్తారా?

పాలు పోసి సంపాదించి కాలేజీలు స్థాపించా..

సాక్షి, హైదరాబాద్‌: ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నా పైసలతోనే బిడ్డ పెండ్లి చేసిండు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా నేను డబ్బులు ఇవ్వ లేదని రేవంత్‌ ప్రమాణం చేస్తారా?’అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి మంగళవారం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో మల్లారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘రేవంత్‌ రక్తం తాగే మనిషి, దుర్మార్గుడు. గతంలో ఇద్దరం టీడీపీలో ఉన్నప్పుడు 24 గంటలూ బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. నేను ఎంపీ సీటు అడిగినందుకు కాలేజీలు మూయిస్తా అని బెదిరించాడు. దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లేని ఫిర్యాదులు చేశాడు. ఎంపీగా నేను గెలిచినా బ్లాక్‌మెయిలింగ్‌ ఆపలేదు. డబ్బులిస్తావా లేక కాలేజీలు మూయించాలా? అని బెదిరించేవాడు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పినా లాభం లేకపోయింది. పాలమ్మి, వ్యవసాయం చేసి వచ్చిన డబ్బుతో కాలేజీలు స్థాపించి సంపాదించా. మరి రేవంత్‌ ఏం వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టాడో చెప్పాలి?’అని డిమాండ్‌ చేశారు. 

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌... 
‘రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌. టీడీపీలో లోకేశ్‌ను పట్టుకొని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి తెచ్చుకున్నాడు. టీ టీడీపీ ఉనికి కోల్పోవడంతో కాంగ్రెస్‌లో డబ్బులు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడని ఆ పార్టీ నేతలే ఆరోపించారు. రేపు చివరకు ఉత్తమ్, భట్టి, జానారెడ్డి వంటి నేతలతోపాటు రాహుల్‌నూ కూడా బ్లాక్‌మెయిల్‌ చేసి రేవంత్‌ బీజేపీలోకి వెళ్తాడు’అని మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్‌పై న్యాయపరమైన పోరాటం చేసి జైలుకు పంపుతానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 

ప్రదేశ్‌ చీటర్స్‌ కమిటీగా మార్చాడు: కేపీ 
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని రేవంత్‌రెడ్డి ప్రదేశ్‌ చీటర్స్‌ కమిటీగా మార్చారని, కేసీఆర్‌ రైతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారితే, రేవంత్‌ రౌడీలు, కేడీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా తయారయ్యారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ విమర్శించారు.  రేవంత్‌ లాంటి చీడపురుగులను చూసి ఆయన కులానికి చెందిన వారు బాధపడుతున్నారన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top