రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు?

Telangana BJP president changing Again - Sakshi

లోక్‌సభ ఎన్నికల దాకా కొనసాగేందుకు కిషన్‌రెడ్డి విముఖత? 

అసెంబ్లీ ఎన్నికల వరకే ఉంటానని ముందే స్పష్టీకరణ 

ఫలితాలు నిరాశ పరచడం కూడా కారణం! 

సొంత నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన 

మళ్లీ బండి సంజయ్‌ లేదా ఈటల లేదా అర్వింద్‌!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీకి త్వరలోనే కొత్త సారథి రాబోతున్నారా? ఈ ప్రశ్నకు పార్టీవర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, గతంలో బండి సంజయ్‌ స్థానంలో నియమితులైనప్పుడే..అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకే ఈ బాధ్యతలు నిర్వహిస్తానని జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అందుకు జాతీయ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. కాగా నాయకత్వం ఒత్తిడి మేరకు అప్పట్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి, ఇటీవలి ఎన్నికల ఫలితాల దృష్ట్యా కూడా..లోక్‌సభ ఎన్నికల దాకా కొనసాగేందుకు సుముఖంగా లేరని అంటున్నారు.

ప్రస్తుతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లకు సీఎంల నియామకం కసరత్తులో బీజేపీ అగ్రనాయకత్వం తలమునకలై ఉంది. దీంతోపాటు పార్లమెంట్‌ సమావేశాలు కూడా జరుగుతున్నందున తెలంగాణలో బీజేపీ సాధించిన ఫలితాలు, ఇతర పరిణామాలపై జాతీయ నాయకత్వం పెద్దగా దృష్టి సారించలేదని చెబుతున్నారు.

అయితే ఆ మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపికపై స్పష్టత వచ్చి, వారు ప్రమాణస్వీకారం చేసే లోగానే రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో కిషన్‌రెడ్డి ఉన్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలుత రాజీనామా సమర్పించాలని, ఆ తర్వాత నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానితో నిమిత్తం లేకుండా ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు.  

భిన్న వాదనలు 
జాతీయ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు కీలకం కావడంతో పాటు ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గతంలో గెల్చిన నాలుగు సీట్ల కంటే అధిక స్థానాలు గెలవాలనే లక్ష్యం పెట్టుకోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వ మార్పు సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం ఒకవైపు వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కిషన్‌రెడ్డిని కొనసాగించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కేవలం 8 సీట్లకే పరిమితం కావడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది పార్టీ ముఖ్య నేతలను ఆవేదనకు గురి చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు తన సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవకపోవడంతో ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో కిషన్‌రెడ్డి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయన ఒప్పుకోక పోవచ్చునని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top