
ఈవీఎంల పనితీరుపై గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలోనూ తీవ్ర చర్చ నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం చూశాం. ఏపీలో ఎన్డీయే కూటమిది ఈవీఎంల గెలుపేనంటూ చెబుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. చాలా దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం చూశాం. ఈ క్రమంలో.. ఈవీఎంల గుట్టురట్టు అయిన ఘటన ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఓట్ చోరీ వ్యవహారం వార్తల్లోకెక్కిన వేళ.. హర్యానాలోని ఓ కుగ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతోంది. కొన్నేళ్ల క్రితం ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చాయి. కానీ.. ఓడిపోయిన వ్యక్తి వేసిన కేసు.. న్యాయస్థానాల్లో నలిగి చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం అసాధారణ రీతిలో సర్పంచ్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తెప్పించుకుంది. ఓట్ల లెక్కింపు మరోసారి జరిపించింది. ఆశ్చర్యకరంగా.. అప్పుడు ఓడిన వ్యక్తి.. ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలిచాడు! ఈ నాటకీయ పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జరిగింది ఇదీ..
హర్యానాలోని బవునా లఖూ.. ఓ చిన్న గ్రామం. 2022 నవంబరులో ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో కులదీప్ సింగ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, మోహిత్ సింగ్ అనే అభ్యర్థి ఈ ఫలితాలను సవాల్ చేశాడు. ఎన్నికల ట్రైబ్యునల్ బూత్ నెంబరు-69లో రీపోలింగ్ నిర్వహించారు. కానీ.. హర్యానా హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేసింది. దీంతో మోహిత్ కుమార్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. కేసు విచారించిన సుప్రీంకోర్టు గత నెల 31న గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ కాకుండా 65 నుంచి 70వ నెంబరు బూత్‌లన్నింటిలోని ఓట్లను మళ్లీ లెక్కపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Vote Theft Claims via EVMs in India: Haryana Case
Allegations of #votechori (vote theft) via Electronic Voting Machines (EVMs) resurfaced after a 2022 sarpanch election in Buana village, Panipat, Haryana. Initially, Kuldeep Singh won with 1,000 votes, but Mohit Kumar’s challenge… pic.twitter.com/tp7m65v7Wk— Adv. Avtaar S Turka / अवतार तुरका 🇮🇳 (@AvtaarTurka) August 14, 2025
ఈ రీకౌంటింగ్ కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరో తేదీన ఇరుపక్షాల సమక్షంలో జరిగింది. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. రీకౌంటింగ్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. 2022లో గెలిచిన కుల్‌దీప్ సింగ్‌కు 1000 ఓట్లు దక్కితే.. ఓడిన మోహిత్ సింగ్‌కు 1051 ఓట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈ ఫలితాలను ధ్రువీకరించి నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 11న మోహిత్ కుమార్‌ను విజేతగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లోగా ఈ ఫలితాన్ని నోటిఫై చేయాల్సిందిగా కూడా స్పష్టం చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చునని, రీకౌంటింగ్ ఫలితాలు మాత్రం మారవని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఈవీఎంల విషయంలో దేశంలో పలు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం పలు అనుమానాలకు తావిచ్చింది ఫలితాలు వెలువడినప్పటి నుంచే వైఎస్సార్‌సీపీ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలకు బదులు బాలెట్ పేపర్లను ఎన్నికల్లో తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈవీఎంలపై అనుమానాలతో ఒంగోలు ఓట్ల గోల్‌మాల్ వ్యవహారంపై ఆయన కోర్టును సైతం ఆశ్రయించారు.
అంతెకాదు.. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ప్రస్తావించిన అంశం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజుకు మధ్య ఓట్ల శాతంలో తేడాను, భారీ ఓట్ల చోరీని(48 లక్షల ఓట్లు) ఆయన ప్రస్తావించారు. ఓట్ల చోరీపై పోరాటం అంటున్న రాహుల్ గాంధీ.. ఏపీ ఫలితాలపై ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు.