ఆర్డినెన్స్‌ వివాదం.. ఆప్‌కు షాక్‌ ఇవ్వనున్న కాంగ్రెస్‌?

 Source Said Congress May Not Support AAP On Centre Ordinance - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై వివాదం మరింత ముదురుతోంది. దేశ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను నేతలను వరుసగా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. గత వారం రోజులుగా బీహార్‌ సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కేసీఆర్‌ వంటి నేతలతో సమావేశమయ్యారు. 

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో ఆమ్‌ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్‌ తీవ్రంగా యోచిస్తోంది.  ఈ మేరకు డిల్లీ, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదనే సూచించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ, పంజాబ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ను దెబ్బతీశారని పార్టీ నేతలు హైకమాండ్‌కు తెలిపినట్లు సమాచారం. కేజ్రీవాల్‌కు మద్దతివ్వడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌ బీజేపీకి చెందిన ‘బీ-టీమ్‌’గా అభివర్ణించిన నేతలు ఆ పార్టీకి మద్దతిస్తే బీజేపీకి ఇచ్చినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. 
చదవండి: పొంగులేటి, తుమ్మల బీజేపీలో చేరికపై ఈటల సంచలన వ్యాఖ్యలు!

కాగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ మద్దతు కూడా కోరారు. దీనిపై సమావేశమై చర్చించేందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమయం కూడా కోరారు. అయితే  పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని  అరవింద్ కేజ్రీవాల్‌కు మల్లికార్జున్ ఖర్గే తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీ, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలతో ఖర్గే భేటీ జరగడం విశేషం. అంతేగాక  కాంగ్రెస్‌ తన నిర్ణయం ప్రకటించేముందు ఇతర రాష్టాలకు చెందిన తమ పార్టీ నేతలతో సమావేశమై, వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోనుంది. 

ఖర్గేతో భేటీ అనంతరం పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్‌ ముందు ఉంచామని తెలిపారు. తుది నిర్ణయం పార్టీ అధినేతకే వదిలేసినట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులందరూ ఇదే విషయంపై కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఈ భేటీలో ఏం జరిగిందనేది  అంతర్గత విషయాలకు సంబంధించిందని, కాంగ్రెస్ చీఫ్ లేదా రాహుల్ గాంధీ మాత్రమే వివరాలు వెల్లడిస్తారని మరో నేత నవజ్యోత్ సిద్ధూ అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఓ పవిత్ర గ్రంథంగా అభివర్ణించిన సిద్ధూ.. ప్రస్తుతం రాజ్యాంగ విలువలు అధోగతి పాలయ్యాయని నమ్ముతున్నట్లు తెలిపారు.
చదవండి: కరెంట్‌ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్‌ జరిగేది ఇదే: విద్యుత్‌ శాఖ వార్నింగ్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top